కిష‌న్ రెడ్డి... ఇక సెటైర్లు వేయించుకోద‌ల్చుకోద‌ట‌

మొత్తంగా కిష‌న్ రెడ్డి దూకుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకింత‌ ఆలోచనలో పడాల్సిన పరిస్థితిని కిష‌న్ రెడ్డి క‌ల్పించార‌నే అంటున్నారు

Update: 2023-09-04 03:43 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్యమనస్కంగానే బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల పార్టీ వ్యవహారాల్లో తన ముద్ర వేసుకుంటున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన కనుస‌న్న‌ల్లోనే అన్ని నిర్ణ‌యాలు జరిగేలా చేయడం మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై వివిధ అంశాల పట్ల స్పందించడం విషయంలోనూ కిషన్ రెడ్డి దూకుడు పెంచినట్లుగా అర్థమవుతుంది. దీనికి తోడుగా తాజాగా ఆయ‌న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఈ ప్ర‌చారాన్ని బ‌లోపేతం చేసే విధంగానే ఉన్నాయి.

హైదరాబాదులో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్రం మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఏకకాలంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించంతో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వంపై తమ వైఖరిని సైతం ఆయన వ్యక్తీకరించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేప‌ట్ట‌బోయే రైల్వే ప్రాజెక్టుల వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివ‌రించారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాలను మినహాయిస్తే తెలంగాణలో అత్యంత తక్కువ రైల్ కనెక్టివిటీ ఉందని పేర్కొన్న కిషన్ రెడ్డి ఈ సమస్యను నివారించేందుకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. రైల్వే లైన్ల డ‌బ్లింగ్‌, ట్రిప్లింగ్ మ‌రియు ఇత‌ర పనులు చేపట్టడమే కాకుండా నూతన ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయిస్తున్నామని కిష‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు.

కేవలం రైలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల్ని కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌క నిర్ణ‌య‌మైన యాదాద్రి అభివృద్ధి గురించి సైతం కిషన్ రెడ్డి తన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. సికింద్రాబాద్‌, హైద‌రాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ సౌలభ్యం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున తమ బీజేపీ ప్ర‌భుత్వం, పార్టీ ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, కేటాయించాల్సిన భూమి, నిధుల విషయంలో గులాబీ దళపతి సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని కిష‌న్ రెడ్డి మండిపడ్డారు. అందుకే పూర్తిగా 100% నిధులతో యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం కల్పించనున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. తద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మక నిర్ణయంలో తమ వంతు మైలేజ్ పొందే ప్రయత్నం చేశారు.

దీంతోపాటుగా ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరించినట్లు ఇటీవల కీలక నిర్ణయం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెక్ పెట్టే విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఔటర్ రింగ్ రైల్‌ సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు కిష‌న్ రెడ్డి నేడు ప్రకటించారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున నిధులను కేటాయించనున్నట్లు ఆయ‌న‌ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్ పోషించిన పాత్రని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ కేంద్రం తలపెట్టిన అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే కనుక ఆ క్రెడిట్ ఖ‌చ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది.

మొత్తంగా కిష‌న్ రెడ్డి దూకుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకింత‌ ఆలోచనలో పడాల్సిన పరిస్థితిని కిష‌న్ రెడ్డి క‌ల్పించార‌నే అంటున్నారు. తాజా విలేకరుల సమావేశంలో వెల్లడించిన నిర్ణయాల ప్రకారం బీజేపీ తెలంగాణను కేవలం తమ అధికార క్షేత్ర ప్రయోగంగానే మార్చడం భావించట్లేదని రాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామను అనే విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రం కోసం ఏం నిధులు తెచ్చావు కిష‌న్ రెడ్డి అంటూ ప్ర‌శ్న‌లు ఎదుర్కొనే సంద‌ర్భం ఇక ముందు ఎదురుకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. బీజేపీ, కిష‌న్ రెడ్డి ప్రస్తుత గేమ్ ప్లాన్ కి చాణుక్యుడిగా పేరొందిన గులాబీ దళపతి ఏ విధంగా స్పందిస్తారో మ‌రి !

Tags:    

Similar News