తెలంగాణలో పోటీ పెరిగిపోతోందా?
తాజాగా విడుదలైన ఎంఎల్సీ స్ధానాల భర్తీ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా పోటీ పెరిగిపోయింది
తాజాగా విడుదలైన ఎంఎల్సీ స్ధానాల భర్తీ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా పోటీ పెరిగిపోయింది. దశలవారీగా ఆరు శాసనమండలి స్ధానాలను భర్తీచేసే అవకాశముంది. అయితే తాజాగా ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్ధానాలకు కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిపికేషన్ జారిచేసింది. ఈ రెండు సీట్లు కూడా బీఆర్ఎస్ తరపున ఎంఎల్ఏలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయినవే. అధికారంలో ఉన్నపుడు కడియం, పాడిని కేసీయార్ ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీలుగా అవకాశమిచ్చారు.
మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళిద్దరు స్టేషన్ ఘన్ పూర్, హుజూరాబాద్ నుండి ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలిచారు. దాంతో తమ ఎంఎల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఆ ఖాళీలనే ఇపుడు ఎన్నికల కమీషన్ భర్తీ చేసేందుకు నోటిపికేషన్ జారీచేసింది. భవిష్యత్తులో భర్తీ చేయబోయే నాలుగు సీట్ల సంగతి ఎలాగున్నా ఇపుడు వచ్చిన నోటీపికేషన్లోనే తాము ఎంఎల్సీలు అవ్వాలని చాలామంది సీనియర్ నేతలు పోటీపడుతున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ దక్కని నేతలు, అధిష్టానం హామీమేరకు టికెట్లను త్యాగాలు చేసిన మరికొందరు, చాలాకాలంగా ఎలాంటి పదవులకు నోచుకోని మరికొందరు సీనియర్లు ఇలా అనేక కేటగిరిల్లో పోటీపడుతున్నారు. అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, రాములు నాయక్, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, బండ్ల గణేష్, తీన్మార్ మల్లన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు గట్టిగా పోటీపడుతున్నారు. రెండుస్ధానాల్లో నియమితులవ్వబోయే వాళ్ళు ఫైనల్ అవటంలో రేవంత్ రెడ్డి సిఫారసు కూడా ముఖ్యమే. ఎంత పోటీ ఉన్నా నేరుగా గెలుచుకోబోయేది ఒక్కసీటు మాత్రమే. ఎందుకంటే 40 మంది ఎంఎల్ఏలు ఒక ఎంల్సీ అభ్యర్ధికి ఓట్లేయాల్సుంటుంది.
పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే రేవంత్ సిఫారసంటే అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరామ్ కే ఉంటుందట. అయితే కాంగ్రెస్ లో విచిత్రం ఏమిటంటే రేవంత్ కు ప్యారెలల్ గా ఢిల్లీలోని అధిష్టానంతో కూడా చాలామంది నేతలు మంచి సంబంధాలు మెయిన్ టైన్ చేస్తుంటారు. కొన్నిసార్లు రేవంత్ ను కాదని కూడా అధిష్టానంతో ఓకే చేయించుకోగలిగిన కెపాసిటి చాలామంది నేతలకు ఉంటుంది. మరి ఇపుడు ఆ ఇద్దరి ఎవరో చూడాలి.