అమెరికాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి!
వీరిలో నివేష్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందినవారు కాగా.. గౌతమ్ కుమార్ ది జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ అని తెలుస్తోంది!
అమెరికాలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందుతున్న భారతీయుల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ జాబితాలో తెలుగు వారి సంఖ్యా పెరుగుతుంది. ఈ సమయంలో తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అమెరికాలో చదువుతున్న తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
అవును... అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడ చదువుతున్న తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం... శనివారం రాత్రి పెయోరియాలో వారు ప్రయాణిస్తున్న కారు మరొక కారును ఢీకొనడంతో 19 ఏళ్ల నివేష్ ముక్కా, గౌతమ్ కుమార్ పార్సీ అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు.
వీరిలో నివేష్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందినవారు కాగా.. గౌతమ్ కుమార్ ది జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ అని తెలుస్తోంది! ఇద్దరూ అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి యూనివర్సిటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని తెలుస్తుంది.
దీంతో... నివేష్, గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా, రెండు కార్ల డ్రైవర్లు గాయపడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలో... మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని ఇద్దరు విద్యార్థుల కుటుంబాలు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాగా... విదేశాల్లోని భారతీయ విద్యార్థుల భద్రతపై పెరుగుతున్న భయాందోళనల మధ్య, ఈ మరణాలు మరింత ఆందోళనలను మరింత పెంచుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే సుమారు పదికి పైగా భారతీయ విద్యార్థుల మరణాలు నమోదయ్యాయనే వాస్తవం ఈ సంఘటనను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.