తెలంగాణ ఓటర్ మైండ్ సెట్ ఏంటి? కన్ఫ్యూజనా.. క్లారిటీనా?

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు మరో నాలుగురోజులు మాత్రమే గడువుంది. ఈ రోజు (ఆదివారం)ను మినహాయిస్తే మిగిలేది నాలుగు రోజులే.

Update: 2023-11-26 05:26 GMT

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు మరో నాలుగురోజులు మాత్రమే గడువుంది. ఈ రోజు (ఆదివారం)ను మినహాయిస్తే మిగిలేది నాలుగు రోజులే. పోలింగ్ జరిగే రోజును కూడా మినహాయిస్తే మిగిలేది మూడు రోజులే. చూస్తుండగానే ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ దగ్గరకు వచ్చేసింది. ఇలాంటి వేళ.. ఓటరు మైండ్ సెట్ ఎలా ఉంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏ పార్టీ గెలుస్తుంది? గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రశ్నతో పాటు.. ఓటరు క్లారిటీతో ఉన్నారా? కన్ఫ్యూజన్ తో ఉన్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

దీనికి కారణం.. హంగ్ వాదన కొత్తగా పుట్టుకు రావటమే. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నేటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు.. వినిపిస్తున్న వాదనల్ని చూసినప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటానికి ముందు నుంచి నోటిఫికేషన్ విడుదలై.. నామినేషన్ల ఘట్టం పూర్తి అయ్యే వరకు తెలంగాణ అధికార పక్షానికే మొగ్గు ఉందన్నది కాదనలేని నిజం.

తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తున్నా.. బీఆర్ఎస్ బలాన్ని మాత్రం ఎవరూ తక్కువగా చూసింది లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్న వాదన వినిపించినోళ్లు ప్రతి పది మందిలో ముగ్గురు మాత్రమే. కానీ.. నామినేషన్ల ఘట్టం పూర్తైన తర్వాత నుంచి అభిప్రాయాలు త్వరగా మారిపోవటంతో పాటు.. అధికార పార్టీ జోరుకు బ్రేకులు పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇందులో వాస్తవం ఎంతన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని చెప్పాలి.

అంతేకాదు.. కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందన్న మాట చెబుతున్నప్పటికి.. సర్వే రిపోర్టుల పేరుతో వస్తున్న వాటిల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న గణాంకాలే కనిపిస్తున్నాయి. దీంతో.. ఒక కన్ఫ్యూజన్ పెరుగుతోంది. అందరి అంచనాలకు భిన్నంగా హంగ్ కు అవకాశం ఉందా? అన్న లెక్కలు మొదలయ్యాయి. హంగ్ ఎందుకువస్తుంది? ఎప్పుడు వస్తుంది? అన్నది చూసినప్పుడు ఓటరు లెక్కలు తేల్చుకోలేనప్పుడే మాత్రమేనన్నది మర్చిపోకూడదు.

ఒక రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఓటరు ప్రాధామ్యాలు వేరుగా ఉన్నప్పుడు కూడా హంగ్ కు అవకాశం ఉంటుంది. తెలంగాణలో అలాంటి కన్ఫ్యూజన్ కానీ.. వేర్వేరు ప్రాధామ్యాలు ఉన్నట్లుగా కనిపించట్లేదు. దీంతో.. ఓటరు కన్ఫ్యూజన్ తో ఉన్నారన్న మాట ఎక్కడా కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే.. ఓటరు క్లారిటీగా ఉన్నారన్న మాటే బలంగా వినిపిస్తోంది. అయితే.. ఆ వైపు.. లేదంటే ఈ వైపే తప్పించి.. ఊగిసలాటే లేదని చెప్పాలి.

అలాంటప్పుడు హంగ్ కు అవకాశం లేదని.. క్లియర్ కట్ మెజార్టీ ఖాయమంటున్నారు. దీనికి తోడు తెలుగు ప్రజలు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ లో ఉండరని.. చెప్పాలనుకున్నది ఏమైనా క్లారిటీగా చెప్పేస్తారంటున్నారు. ఈ లెక్కన చూసినప్పుడు హంగ్ కు అవకాశం లేదని.. క్లియర్ కట్ మెజార్టీతోనే ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని చెబుతున్నారు. దీనికి తోడు ఇప్పటివరకు వెలువడిన అంచనాల్లో ఎక్కడా కూడా హంగ్ ప్రస్తావన రాకపోవటాన్ని మర్చిపోకూడదు. మొత్తంగా తెలంగాణ ఓటరుకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని..క్లారిటీ ఉన్నారని చెప్పకతప్పదు.

Tags:    

Similar News