తిప్పి.. తిప్పి అక్కడకే తీసుకెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇప్పటికే ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించిన రేవంత్ నోటి నుంచి ఇదే మొదటిసారి కాదు.
ఫార్మాసిటీ.. ఫ్యూచర్ సిటీ.. నాలుగో నగరం.. కాలుష్య రహిత నెట్ జీరో సిటీ.. ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి ఏం చెప్పినా..చివరకు వెళ్లి ఆగేది ముచ్చెర్ల దగ్గరే. హైదరాబాద్ మహానగరానికి ఇప్పటివరకు హైదరాబాద్.. సికింద్రాబాద్.. సైబరాబాద్ అన్నవి ఉంటే.. రానున్న నాలుగేళ్ల వ్యవధిలో మరో మహానగరాన్ని నిర్మిస్తానని.. అదే హైదరాబాద్ కు నాలుగో నగరంగా మారుతుందని.. అదే హైదరాబాద్ భవిష్యత్ సిటీగా అభవర్ణిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇప్పటికే ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించిన రేవంత్ నోటి నుంచి ఇదే మొదటిసారి కాదు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఫార్మాసిటీ వద్ద కొత్త నగరాన్ని క్రియేట్ చేస్తామని.. దీని కోసం భారీ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఈ కొత్త చోట ఐటీ కంపెనీలు మొదలు పర్యాటకం.. విద్య.. ఆరోగ్యం.. ఏఐ హబ్ తో పాటు స్కిల్ సిటీగా కూడా చేస్తామని చెబుతున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో అద్భుత నగరిగా మారుస్తామని.. హైదరాబాద్ కు ఫ్యూచర్ అదేనంటూ రేవంత్ పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.
ఇక్కడో కీలక అంశాన్ని ప్రస్తావించాలి. సీఎం రేవంత్ నోటి నుంచి తాను నిర్మించే కొత్త నగరి గురించి చెప్పే సందర్భంలో ప్రతిసారీ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రస్తావించటం.. దాని గురించి గొప్పగా చెప్పటం.. చివరకు గమ్యస్థానం తాను తరచూ చెప్పే కొత్త నగరి గురించే అవుతోంది. మొత్తంగా హైదరాబాద్ మహానగరికి అనుబంధంగా డెవలప్ చేయాలని భావిస్తున్న ఈ కొత్త నగరం గురించి తాను పాల్గొనే ప్రతి వేదిక మీదా గొప్పగా చెబుతున్నారు.
ప్రతి సందర్భంలోనూ కొత్తగా చెప్పటంతో కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి వచ్చే కొత్త నగరం ఒక్కటేనన్నవిషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాకుంటే.. కొందరు ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ చెప్పే మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న విమర్శ ఉంది. అది సీఎం తప్పు కాదని.. సాధారణ ప్రజలదేనని చెప్పాలి.
గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్.. తమ ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని నిర్మిస్తుందన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. తన నిర్ణయాన్ని కొందరు ఎటకారంగా మాట్లాడుతున్నారని.. నఅందుకే బెగరికంచ గ్రామాన్నిన్యూయార్క్ సిటీ కంటే గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతామని పేర్కొనటం గమనార్హం.
గడిచిన రెండు రోజులుగా అసెంబ్లీలో.. గురువారం సాయంత్రం రంగారెడ్డిజిల్లాలో జరిగిన కార్యక్రమంలోనూ అదే పనిగా చెబుతున్న సీఎం రేవంత్ మరో కీలక వ్యాఖ్య చేశారు. ‘‘బంజారాహిల్స్ లో ఉండే వాళ్ల మాదిరిగా ఈ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్పుకునేలా ఈ కొత్త నగరాన్ని తీర్చిదిద్దుతాం. విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయిలు పెట్టుబడులు తీసుకొచ్చి హెల్త్.. స్పోర్ట్ తో పాటు ఇతర కంపెనీలకు హబ్ గా మారుస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్.. ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ వర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా మార్చొచ్చన్న ఆయన.. ఔటర్ రింగ్ రోడ్డు.. ఎయిర్ పోర్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినట్లుచెప్పారు. మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి నోటి నుంచి ఏం చెప్పినా చివరకు ఫార్మాసిటీ వద్దకు వచ్చి ఆగటం.. రానున్న రోజుల్లో మరో మహానగరాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పటం గమనార్హం.