70ల్లోనూ తగ్గట్లేదు.. తెలంగాణలో బరిలో సీనియర్లు ఎక్కువే
ఈ సారి ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు.
అరవై ఏళ్లు వచ్చాయంటేనే అంతా అయిపోయిందన్నట్లుగా మాట్లాడే వారు కనిపిస్తారు. కానీ.. డెబ్భై ఏళ్ల వయసులోనూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ల జోరు చూస్తే.. వావ్ అనాల్సిందే. దశాబ్దాల తరబడి ఎన్నో ఎన్నికల్నిఎదుర్కొన్న ఈ సీనియర్లకు ఇవే చివరి ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. ఈ పెద్దవయస్కు నేతలు తాజా ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని భావిస్తున్నారు.
ఈ సారి ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. మరో అవకాశం ఉంటుందా? ఉండదా? అన్నది సందేహంగా మారిన వేళ.. ఈ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చాటాలని మాత్రం తపిస్తున్నారు. వీరిపై బరిలో ఉన్న నేతలు యువకులే అయినప్పటికీ.. వారికి ధీటుగా ప్రచారం చేస్తున్న వీరి పోరాట పటిమకు అచ్చెరువు చెందాల్సిందే.
గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఈ సీనియర్ అభ్యర్థుల్లో మొదటి పేరుగా వనమా వెంకటేశ్వరరావును చెప్పాలి. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి మంత్రిగా వ్యవహరించిన ఆయన కొత్తగూడెంలో బీఆర్ఎస్ తరఫున మరోసారి బరిలోకి దిగారు. ఆయన వయసు అక్షరాల 79 ఏళ్లు. ఆయన రాజకీయ వారసుడు రాఘవ బరిలో ఉంటారని భావించినా.. ఆ మధ్యన ఒక కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రాఘవ కంటే ఎన్నికల బరిలో వనమాను దించటమే మేలని గులాబీ పార్టీ భావించింది. అందుకే వనమాకు మరోసారి టికెట్ ఇచ్చింది.
బాన్సువాడ నుంచి ఆరుసార్లు గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. నిజానికి ఈసారి తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని భావించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు ఆయన బరిలో నిలిచారు. ఆయన వయసు 74 ఏళ్లు. తన కొడుక్కి అవకాశం ఇవ్వాలని పోచారం కోరినా.. కేసీఆర్ మాత్రం నో చెప్పి.. ఈసారికి పోటీ చేయాల్సిందేనని కోరటంతో ఆయన బాన్సువాడ నుంచి బరిలోకి దిగారు.
మంత్రిగా వ్యవహరిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి తాజా ఎన్నికల్లో ఆయన నిర్మల్ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 74 ఏళ్ల ఇంద్రకరణ్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.తెలంగాణ ఏర్పాటైన కొలువు తీరిన రెండు ప్రభుత్వాల్లోనూ ఆయన మంత్రిగా వ్యవహరించారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలోకి దిగారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన తాజాగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
డెబ్భై ప్లస్ వయసులో ఎన్నికల బరిలో నిలిచిన మరో సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి. తుంగతుర్తి.. సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు గెలిచిన ఆయన రెండుసార్లు మంత్రిగా వ్యవహరించారు. 71 ఏళ్లవయసులో ఆయన సూర్యాపేట నుంచి టికెట్ ఆశించారు. నామినేషన్ల గడువుకు ఒక్కరోజు ముందు దామోదర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ను సొంతం చేసుకున్నారు. ఆయనకు పటేల్ రమేశ్ రెడ్డి నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. పార్టీటికెట్ ను సొంతంచేసుకోవటంలో విజయం సాధించిన ఆయన ఎన్నికల్లోనూ అదే ఊపును ప్రదర్శిస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.