"బ్లాక్ అండ్ వైట్" మధ్య తెలుగు సినిమా 4కే డాల్బీ @ ఐటీ!
ఈ నేపథ్యంలోనే వంద కోట్ల నుంచి రెండొందల కోట్లు పైగా రెమ్యునరేషన్ తీసుకునే టాప్ హీరోలు మొత్తం వైట్ లోనే తీసుకుంటున్నారా..?
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీఎస్టీ, టీడీఎస్ లు పక్కాగా మెయింటైన్ చేసినా కూడా లొసుగులపై చర్చ జరుగుతుందనే విషయంతో ఇప్పుడు కలర్ ఫుల్ 4కే డాల్బీ స్క్రీన్ వెనుక "బ్లాక్ అండ్ వైట్" అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అవును... గత కొంత కాలంగా సినిమా విడుదలైన తర్వాత అది హిట్ అయ్యిందా, అట్టర్ ఫ్లాప్ అయ్యిందా అనే విషయంపై సామాన్య ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ... అభిమానుల ఒత్తిడి మేరకో, తమ హీరో ఈగోని సంతృప్తి పరచడం కోసమో తెలియదు కానీ... ‘కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్స్’ అంటూ పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
వాస్తవానికి ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిందంటే.. అందులో ప్రధానంగా అగ్రతాంబూలం కథానాయకుడి ఖాతాలోకి వెళ్తుందని అంటారు. ఈ నేపథ్యంలోనే.. సినిమా (బడా) హీరోలంతా తమ తమ రెమ్యునరేషన్స్ వైట్ లో తీసుకుంటే తమకు ఎలాంటి సమస్యా ఉండదని ఓ నిర్మాత తన వద్ద వాపోయారంటూ ఓ జర్నలిస్టు ఇటీవల వెంకటేష్ వద్ద ప్రస్థావించారు.
దీనిపై స్పందించిన వెంకటేష్.. మిగిలిన వారి సంగతి తనకు తెలియదు కానీ... తాను తీసుకునేది కొంతే, అది కూడా వైట్, వైట్ లకే వైట్, ప్యూర్ వైట్ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో... వైట్ కాకుండా కూడా సినిమా హీరోలకు రెమ్యునరేషన్ వెళ్తుందన్నమాట అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వంద కోట్ల నుంచి రెండొందల కోట్లు పైగా రెమ్యునరేషన్ తీసుకునే టాప్ హీరోలు మొత్తం వైట్ లోనే తీసుకుంటున్నారా..? వారి రెమ్యునరేషన్ నిర్మాతలు మొత్తం వైట్ లోనే చూపిస్తున్నారా..? ఆ రెమ్యునరేషన్ మొత్తం టీడీఎస్ తో కలిపా, టీడీఎస్ కట్ అయిపోగానా..? అనేవి మరో భారీ ప్రశ్నలు చెబుతున్నారు.
అయితే... ఉదాహరణకు ఒక సినిమా హీరోకి 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అని మాట్లాడుకుంటే... ఆ హీరోకి రూ.100 కోట్లకు సంబంధించిన జీఎస్టీ కూడా సదరు నిర్మాతే భరించి నికరంగా 100 ముట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారని.. అందువల్ల నిర్మాతలకు ఈ తలనొప్పులు రావడం, ఐటీ అధికారుల చూపులు ఉండటం అనే చర్చా నడుస్తుంది!
ఇక వసూళ్ల విషయానికొస్తే.. ఇప్పుడు గరిష్టంగా సినిమా టిక్కెట్స్ ఆన్ లైన్ లోనే నడుస్తున్నాయని అంటున్నారు. దీంతో.. ఏ రోజు ఎన్ని టిక్కెట్లు తెగాయి అనేది తెలుసుకోవడం నిర్మాతకు పెద్ద విషయం కాదని అంటున్నారు. సో... కలెక్షన్స్ విషయంలో నిర్మాతకు ఉన్న క్లారిటీ ఓపెన్ విషయమే అనేది చాలా మంది చెప్పే మాట.
అయితే... అవి కలెక్షన్స్ రికార్డులు అంటూ పోస్టర్స్ రూపంలో ప్రత్యక్షమయ్యే నెంబర్స్ కి సమానంగానే ఉంటాయా.. లేక, ముందుగా చెప్పుకున్నట్లుగా అభిమానుల ఒత్తిడి మేరకో, హీరో ఈగో సంతృప్తి కోసమో అన్నట్లుగా అంకెలు పెద్దవి చేసి చూపించుకుని అటు ఆత్మవంచన చేసుకుంటూ, ఇటు ఐటీ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది నిర్మాతలే చెప్పాలి!
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన "నేనింతే" సినిమాలో షియాజీ షిండే క్యారెక్టర్.. సినిమా నిర్మాత కష్టాలు చెప్పకనే చెప్పిన పరిస్థితి! అది వాస్తవానికి దూరంగా ఉందని అయితే ఏ నిర్మాత చెప్పరనే అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఐటీ దాడులకు కారణం నిర్మాతలేనా..? లేక, హీరోల రెమ్యునరేషన్ లో నలుపూ తెలుపులా..? అదీగాక హెచ్చులకు పోయి చూపించే రికార్డ్ కలెక్షన్ నెంబర్సా..? అనేది తెలియాల్సి ఉంది!
తెరపై ఎంతో కలర్ ఫుల్ గా కనిపించే సినిమా నిర్మాణం వెనుక కంటికి కనిపించని బ్లాక్ & వైట్ లెక్కలు ఉన్నాయా అనేది నిర్మాతలకే తెలియాలి. సాధారణంగా... ఏ రంగు రావాలన్నీ బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ పర్సంటేజ్ అన్నట్లుగా.. లెక్కలు కూడా ఉంటాయా..? ఆఫ్ ద రికార్డ్ తప్ప ఆన్ ది రికార్డ్ తెలిసే అవకాశం ఉందో లేదో వేచి చూడాలి!