33 % కోటా.. ఆతిశీ సరే.. తెలంగాణ, ఏపీల్లో మహిళా సీఎం ఎప్పుడు?
అంటే చట్ట సభల్లో మహిళల సంఖ్య భారీగా పెరగనుంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల సంగతి ఏమిటి? అనే ప్రశ్న వస్తోంది.
ఎక్కడో అన్న అసోంలో అవకాశం దక్కింది.. వెనుకబడిన ఒడిశాలోనూ అవకాశం దక్కింది.. అద్భుతంగా డెవలప్ అయిన గుజరాత్ లోనూ అవకాశం దక్కింది.. తమిళనాడులో 35 ఏళ్ల కిందటే అవకాశం దక్కింది.. ఇక ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో అవకాశం దక్కింది. ఢిల్లీలో అయితే మూడోసారి అవకాశం దక్కింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎప్ప్పుడు..? అనే ప్రశ్న వస్తోంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. రాజకీయాల్లోనూ దూసుకెళ్తున్నారు. మున్ముందు మహిళలకు రాజకీయాల్లో 33 శాతం కోటా అందుబాటులోకి రానుంది. అంటే చట్ట సభల్లో మహిళల సంఖ్య భారీగా పెరగనుంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల సంగతి ఏమిటి? అనే ప్రశ్న వస్తోంది.
17వ మహిళా సీఎం..
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆతిశీ ఆ రాష్ట్రానికి మూడో మహిళా సీఎం కావడం విశేషం. సుష్మా సర్వాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఆమె ఈ పదవిలోకి రానున్నారు. కేవలం 25 ఏళ్లలోనే ఆ రాష్ట్రానికి ముగ్గురు మహిళలు సీఎంలుగా కానుండడం గమనార్హం. ఇక దేశంలో ఇప్పటివరకు 16 మంది మహిళలు ముఖ్యమంత్రులు అయ్యారు. వీటిలో అతిచిన్న రాష్ట్రం గోవా నుంచి అతిపెద్ద రాష్ట్రం యూపీ వరకు మహిళలు సీఎంలుగా బాధ్యతలు నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రంలోని అసోంకు, పశ్చిమాన ఉన్న గుజరాత్ కూ అతివలు రాష్ట్ర పగ్గాలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు?
భారత దేశంలోని 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలకు ఇప్పటివరకు మహిళలు ముఖ్యమంత్రులు అయ్యారు. వీటిలో జమ్మూ కశ్మీర్ కూడా ఉండడం గమనార్హం. యూపీలో మాయావతి, తమిళనాడులో జయలలిత నాలుగుసార్లు, బిహార్ లో రబ్రీదేవి మూడుసార్లు, రాజస్థాన్ లో వసుంధర రాజె రెండుసార్లు సీఎంలయ్యారు. మధ్యప్రదేశ్, ఒడిశాలోనూ అతివలు సీఎంలయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో మహిళా నాయకురాళ్లు సీఎంలు అయ్యేది ఎప్పుడు అని ప్రశ్నించుకుంటే సమీప భవిష్యత్ లో కష్టమే అని చెప్పొచ్చు.
ఇవీ చాన్స్ లు.. మరి నాయకురాళ్లు?
ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల చొరవ ఉన్న నాయకురాలే అయినా.. ఆ పార్టీకి అసలు బలం లేదు. ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ మళ్లీ ఏపీలో పుంజుకోవడం అసాధ్యం అనే చెప్పాలి. అయితే, షర్మిల సోదరుడు జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీలోనే ఉండి ఉంటే (సభ్యత్వం తీసుకున్నారో లేదో తెలియదు కానీ), అనుకోని పరిస్థితుల్లో ఏమైనా సీఎంగా అవకాశం దక్కేదేమో? ఇదంతా ఊహించుకోవడానికే. కానీ, తెలంగాణలో షర్మిల సొంతంగా పార్టీ పెట్టి ఆపై కాంగ్రెస్ లో కలిపేసి ఏపీకి అధ్యక్షురాలు అయ్యారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మాత్రమే ప్రధాన నాయకురాలిగా ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన కవితకు అదో పెద్ద విఘాతం అనుకోవాలి.
విజయశాంతి, లక్ష్మీపార్వతి..
ఉమ్మడి ఏపీ ఉండగా ప్రముఖ సినీ నటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పేరిట కొత్త పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దానిని వేరే పార్టీలో విలీనం చేశారు. బీఆర్ఎస్ తరఫన ఎంపీగానూ గెలిచారు. బీజేపీ, బీఆర్ఎస్ లలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సైతం ఎన్టీఆర్ తెలుగుదేశం పేరిట పార్టీని స్థాపించారు. 1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె ఆ తర్వాత మళ్లీ విజయం సాధించలేదు. వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతూ ఇటీవలి వరకు ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవిలో కొనసాగారు. వీరి స్థాయిలో మరే మహిళా నాయకురాలు తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. మరోవైపు గతంలోనూ తెలుగు మహిళా నాయకురాళ్లు ఎవరూ సీఎం పదవి స్థాయికి చేరలేదు.