ఈ లక్ష్మీపతి మామూలోడు కాదు... హ్యాక్ చేసి 4 కోట్లు నొక్కేశాడు!

అతనికి పరిహారంగా "రివార్డ్ 360" వోచర్ ఇచ్చింది. అక్కడ నుంచి మొదలైంది లక్ష్మీపతి ఆడించిన ఆట!

Update: 2023-09-14 02:30 GMT

ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చదువుకున్న ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్.. రివార్డ్ 360 సంస్థపై తన ప్రతాపాన్ని చూపించి కోట్ల రూపాయలు నొక్కేశాడు! తనకున్న హ్యాకింగ్ స్కిల్స్ తో ఈ కార్యక్రమం కొనసాగించాడు. ఆ సంస్థకు చుక్కలు చూపించాడు. అనంతరం పోలీసులు ఈ కుర్రోడికి ఊచలు చూపించారు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీకి చెందిన బొమ్మలూరు లక్ష్మీపతి అనే యువకుడు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అనంతరం బెంగళూర్ లో ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో డిసెంబర్ లో ఈ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

అనంతరం దుబాయ్ వెళ్లి ఆరు నెలలు అక్కడ పనిచేశాడు. అనంతరం మళ్లీ బెంగళూరుకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఒకసారి లక్ష్మీపతికి క్రెడిట్ కార్డు సమస్య వచ్చింది. దీంతో తన బ్యాంకును సంప్రదించడంతో సమస్యను పరిష్కరించిన బ్యాంకు.. అతనికి పరిహారంగా "రివార్డ్ 360" వోచర్ ఇచ్చింది. అక్కడ నుంచి మొదలైంది లక్ష్మీపతి ఆడించిన ఆట!

అవును... బ్యాంక్ వాళ్లు ఇచ్చిన రివార్డ్ వోచర్ ని తీసుకున్న లక్ష్మీపతి దాన్ని యూజ్ చేసుకోకుండా.. అసలు ఈ "రివార్డ్ 360" వోచర్ సిస్టం ఎలా పనిచేస్తుందో పరీక్షించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో తనకు వచ్చిన హ్యాకింగ్ స్కిల్స్ తో "రివార్డ్ 360" సెక్యూరిటీని ఛేదించాడు. అనంతరం ప్రతీ గిఫ్ట్ వోచర్ తానే పొందేలా కోడ్ సెట్ చేశాడు!

ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 నెలల పాటు ఈ వెబ్‌ సైట్ ని హ్యాక్ చేసి గిఫ్ట్ వోచర్లన్నింటినీ తన అకౌంట్ లో జమ చేసుకున్నాడు. ఇదే సమయంలో బంగారం, వెండి, బైక్స్ కొనుగోలు చేయడానికి ఈ గిఫ్ట్ ఓచర్లను రీడిం చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తూ చేస్తూ ఆ సంస్థకు చుక్కలు చూపించాడు.

దీంతో రివార్డ్ 360 ఖాతాదారులు వోచర్లను రీడీం చేయలేకపోవడంతో ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ సైబర్ క్రైం టీం రంగంలోకి దిగింది. ఈ సమయంలో ఫిర్యాదు చేసినవారివే కాకుండా అన్ని వోచర్లు ఒకే అకౌంట్ కు రీడీం అయినట్లు గుర్తించారు. దీంతో ఈ లక్ష్మీపతి ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అయితే... ఈ ప్రయత్నంలో లక్ష్మీపతి ఒక 5 కిలోల బంగారం, 4.16 కోట్ల రూపాయల విలువైన రివార్డ్ పాయింట్లు వెనకేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఏకంగా 6 లక్షల గిఫ్ట్ వోచర్లను రీడీం చేసేశాడు. దీంతో... ఈ ఏడాది బెంగళూర్ సైబర్ క్రైం పోలీసులు చేసిన అతిపెద్ద సీజ్ ఇదే అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

దీంతో... లక్ష్మీపతిని అరెస్ట్ చేసినట్లు బెంగళూర్ పోలీస్ కమిషనర్ బీ దయానంద ప్రకటించారు. ఇతడు కాలేజ్ రోజుల్లోనే హ్యాకింగ్ నేర్చుకున్నాడని తెలిపారు. తన తెలివి తేటలను ఇలా పనికిమాలిన పనులకు ఉపయోగించాడని అన్నారు. చివరికి కటకటాల పాలయ్యాడని తెలిపారు!

Tags:    

Similar News