తొలి ఆర్నెల్లలో విదేశీ పెట్టుబడుల్లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ?
విదేశీ పెట్టుబడుల విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎంతమేర పెట్టుబడులను ఆకర్షించాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విదేశీ పెట్టుబడుల విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎంతమేర పెట్టుబడులను ఆకర్షించాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన రిపోర్టు తెలుగు రాష్ట్రాలకు నిరాశను మిగిల్చేలా మారింది. తాము తోపుగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం జబ్బులు చరుచుకున్నా.. వారు చెప్పినంత హడావుడి ఏమీ లేదన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలుగు రాష్ట్రాల వెనుకబడి ఉండటం కనిపిస్తుంది. మరింత వేదనకు గురి చేసే అంశం ఏమంటే.. తెలంగాణతో పోల్చినా ఏపీకి వచ్చిన విదేశీ పెట్టుబడుల సంఖ్య మరింత తక్కువగా ఉండటం గమనార్హం.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో దేశంలోకి రూ.1.66 లక్షల కోట్లు విదేశీ పెట్టుబడుల రూపంలో వచ్చాయి. వాటిల్లో మొదటి 3 నెలల్లో (జనవరి -మార్చి) 76,361 కోట్లు రాగా.. తర్వాతి మూడు నెలలు (ఏప్రిల్ - జూన్) మధ్య 89,933 కోట్లు వచ్చాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో దేశంలో మహారాష్ట్ర ముందుంటే.. రెండో స్థానంలో ఢిల్లీ నిలిచింది. తర్వాతి స్థానంలో కర్ణాటక.. గుజరాత్.. హర్యానాలు నిలిచాయి. ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఉండటం గమనార్హం.
అంటే.. జాబితాలో ఆరో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే.. ఏపీ టాప్ పది స్థానాల్లో ఉండకపోవటం గమనార్హం. జాబితాలో ఏపీకి పన్నెండో స్థానం లభించింది. ఏపీ తర్వాత హిమాచల్ ప్రదేశ్.. కేరళ.. ఉత్తరాఖండ్.. మధ్యప్రదేశ్ లు మాత్రమే నిలిచాయి. ఇక.. విదేశీ పెట్టుబడులు ఏ మేర వచ్చాయన్న విషయాన్ని చూస్తే.. అగ్రస్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో రూ.69,870 కోట్లు రాగా.. ఢిల్లీ రాష్ట్రానికి రూ.27,026 కోట్లు.. కర్ణాటక రాష్ట్రానికి రూ.25,660 కోట్లు.. గుజరాత్ కు రూ.10,702 కోట్లు వచ్చాయి.
జాబితాలో మొదటి నాలుగు రాష్ట్రాలు ఐదు అంకెల పెట్టుబడులు రాగా.. ఆ తర్వాత నుంచి నాలుగు అంకెలకు తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.8655 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లుగా కేంద్రం విడుదల చేసిన జాబితా వెల్లడించింది. మొదటి ఆర్నెల్ల వ్యవధిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల్ని రెండు ముక్కలు చేసి.. మొదటి మూడు నెలలు ఒకటిగా.. తర్వాతి మూడు నెలలు మరొక జాబితాగా చూస్తే మాత్రం తెలంగాణ రెండో త్రైమాసికంలో మాత్రం నాలుగో స్థానంలో నిలవటం గమనార్హం.
ఏపీ విషయానికి వస్తే.. తెలంగాణతో పోలిస్తే రెట్టింపు వెనుకబడినట్లుగా చెప్పాలి. మొత్తంగా మొదటి ఆర్నెల్లలో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిస్తే.. ఏపీ పన్నెండో స్థానంలో నిలిచింది. మొదటి ఆర్నెల్ల కాలానికి ఏపీకి వచ్చిన విదేశీ పెట్టుబడులు రూ.744 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. ఇక.. 2019 అక్టోబరు నుంచి దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వారీగా వచ్చిన విదేశీ పెట్టుబడుల లెక్కను చూసినా.. ఏపీకి మొత్తం రూ.6495 కోట్లు పెట్టుబడులు రాగా.. తెలంగాణ మాత్రం రూ.42,595 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగలిగింది.