విభజన పంచాయితీల విలన్ కేసీఆర్?

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేల.. పదేళ్ల తర్వాత కూడా విభజన అంశాల్ని పరిష్కరించుకునే విషయంలో కిందా మీదా పడుతోంది

Update: 2024-07-06 07:27 GMT

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేల.. పదేళ్ల తర్వాత కూడా విభజన అంశాల్ని పరిష్కరించుకునే విషయంలో కిందా మీదా పడుతోంది. విభజన అంశాల్ని లెక్కలు తేల్చుకోవటం మహా అయితే గంట మాత్రమే పడుతుందంటూ ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ తన సహచరులతో పాటు పలువురితో ప్రస్తావించేవారు. అంతేనా.. విభజన ప్రక్రియ ఎంత సింఫుల్ గా తేల్చేయొచ్చన్న విషయాన్ని ఆయన అరటిపండు వొలిచినట్లుగా విడమర్చి చెప్పేవారు. అదంతా విన్న వారికి ఇంత సింఫుల్ విషయాల మీద అంతలా బుర్ర బద్ధలు కొట్టుకుంటారెందుకు? అన్న భావన కలిగేది.

కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపారు కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు విభజన పంచాయితీల మీద అంత సింపుల్ అన్న పెద్ద మనిషి.. రాజకీయ నాయకుడిగా.. పాలనకుడి మారిన తర్వాత పరిస్థితుల్ని ఎందుకు మార్చలేకపోయారు? అన్నది ప్రశ్న. తెలంగాణ ప్రయోజనాల గురించి కొట్లాడే విషయంలో తనకు మించిన వారు మరెవరూ లేరని తనకు తాను చెప్పే కేసీఆర్.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పరిష్కరించలేదంటే దానికో పెద్ద లెక్కనే చెబుతారు.

విభజన వేళ జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ చేతికి అధికారం వస్తే.. ఏపీలో చంద్రబాబుకు వచ్చింది. ఈ ఇద్దరు చంద్రుళ్ల మధ్య సరైన బంధం లేని కారణంగా అప్పటికి ఆగిందని అనుకుందాం. లేదంటే.. చంద్రబాబు చూపు తెలంగాణ వైపు ఉందని.. ఆయన తెలంగాణలో తన పార్టీని విస్తరించే అత్యాశకు పోవటం నచ్చని కేసీఆర్.. ఆయన దూకుడుకు బ్రేకులు వేసేందుకు వీలుగా పంచాయితీలపై పీఠముడులు మరిన్ని వేశారనుకుందాం.

ఆ తర్వాత టర్మ్ లో ఏపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. తెలంగాణకు కేసీఆర్ సీఎంగా కంటిన్యూ అయ్యారు. మొదటి దఫాతో పోలిస్తే.. రెండో దఫాలో కేసీఆర్ - జగన్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే.. ఈ ఇద్దరు అధినేతలు తీసుకున్న నిర్ణయాన్ని నాటి విపక్షాలు ప్రశ్నించి.. ఫైట్ చేసేంత సీన్ లేదు. ఎందుకుంటే.. ఈ ఇద్దరు అధినేతలు ఏదైనా డిసైడ్ చేస్తే.. దాన్ని ఆగంమాగం చేసంత సత్తా నాటి విపక్ష పార్టీలకు లేదు.

దీంతో.. సమస్యలు ఒక కొలిక్కి వచ్చేవి. కానీ.. కేసీఆర్ ముందు చూపుతోనే విభజన పంచాయితీలు ఒక కొలిక్కి రాకుండా చేశారని చెప్పాలి. అదెలా అన్న సందేహం రావొచ్చు. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చంద్రబాబు.. రేవంత్ ఉన్నారు. వీరిద్దరి మధ్య విభజన అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారనుకుందాం. అందులో ఒకట్రెండు అంశాలను ఎత్తి చూపి తెలంగాణ ప్రయోజనాల్ని ఏపీకి తాకట్టు పెట్టేశారంటూ కేసీఆర్ అండ్ కో ఆగమాగం చేయటం ఖాయం.

అంతటి రాజకీయ ప్రయోజనం ఉన్న అంశాన్ని సింఫుల్ గా పరిష్కారాలు వెతికేస్తే.. భవిష్యత్తుకు అవసరమైన భావోద్వేగ రాజకీయ ఎజెండా మిస్ కావటం ఖాయం. అందుకే.. తాను తీసుకునే నిర్ణయానికి అటు తెలంగాణ సమాజం కానీ.. ఇటు ఏపీ ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి ఉండదు. అదే సమయంలో కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి హోదాలో విభజన పంచాయితీలపై కీలక నిర్ణయాన్ని తీసుకుంటే దానిపై రచ్చ చేసేందుకు గులాబీ బాస్ సిద్ధంగా ఉంటారు.

ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి భావిస్తారు. ఆ క్రమంలో గొంతెమ్మ కోరికల్ని కొత్తగా తెర మీదకు తీసుకురావటమో.. పాత పంచాయితీలను తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా వాదిస్తారు. ఏతావాతా తేలేదేమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన పంచాయితీలు ఎప్పటికి తేలకుండా ఉండటే కావాల్సింది.

అప్పుడు మాత్రమే ఆ వివాదాల మంటల్లో రాజకీయం ఎంచక్కా చేసుకోవచ్చు. నిజానికి కేసీఆర్ కున్న సామర్థ్యానికి ఆయన వీటిని సింగిల్ హ్యాండ్ తో పూర్తి చేయొచ్చు. .కానీ.. ఆయనకున్న ప్రత్యేక రాజకీ ఎజెండా నేపథ్యంలో పీటముడులు వేయటమే తప్పించి తీసేందుు ఏమాత్రం ఆసక్తి చూపరు. ఇదంతా చూసినప్పుడు విభజన పంచాయితీల లెక్క తేలకుండా ఉండేలా చేశారు కేసీఆర్. ఆ స్క్రిప్టును ఢీ కొట్టే వాతావరణం ఇప్పటికైతే రెండు తెలుగు రాష్ట్రాల్ని పాలిస్తున్న ముఖ్యమంత్రులకు లేదనే చెప్పాలి.

Tags:    

Similar News