'కేసీఆర్ మార్క్'- చెరిపితేనే విభజన సమస్యల పరిష్కారం!
ఎవరి రాజకీయ పరమైన వివాదాలు.. ఒత్తిడులు వారికి ఉన్నాయి. దీంతో ఎవరినీ తప్పుపట్టే పరిస్థితి లేకుండా పోయింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 2014లో ఏర్పడిన విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పుల భాగాల పంపకం.. దశాబ్ద కాలం గడిచిపోయినా.. ఇంకా అపరిష్కృతంగానే ఉంది. 2014లోనే వీటిని పరిష్కరించుకునేం దుకు ప్రయత్నించాలని.. అప్పటి మోడీ సర్కారు తొలి పార్లమెంటు భేటీలోనే స్పష్టం చేసింది. కానీ, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పట్లో చొరవ తీసుకోలేక పోయారు. ఎవరి రాజకీయ పరమైన వివాదాలు.. ఒత్తిడులు వారికి ఉన్నాయి. దీంతో ఎవరినీ తప్పుపట్టే పరిస్థితి లేకుండా పోయింది.
అయితే.. రాను రాను.. తెలంగాణలో ఉన్న రాజకీయ పరమైన అంశాల కారణంగా.. విభజనచట్టంలో లేని వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి. నిజానికి ఇవి కోరకూడదు. కోరినా ఏపీ ఇచ్చేవి కూడా కాదు. అయిన ప్పటికీ.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. సదరు అంశాలను జోడిస్తూ.. ముందు మీరు ఇవి తేల్చండి! అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. వీటిలో కీలకమైన తిరుమల శ్రీవారి ఆలయ ఆదాయం తెలంగాణకు పంచాలన్నది ఉంది.
అదేవిధంగా తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏపీకి ఆదాయం కూడా అదే రేంజ్‌లో వస్తుందని.. కాబట్టి తమ కు కూడా.. దీనిలో వాటా ఇవ్వాలన్నది మరో ప్రధాన డిమాండ్. ఇక, కృష్ణపట్నం ఓడరేవులోనూ భాగస్వా మ్యం కల్పించాలన్నది ఇంకో డిమాండ్. అయితే.. ఇవేవీ విభజన చట్టంలో లేవనేది ఏపీ వాదన. కానీ, వాటినితీర్చాల్సిందేనన్నది తెలంగాణ పట్టు. దీంతో ఇరు పక్షాల మధ్య కూడా.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి.
తర్వాత కాలంలో జగన్-కేసీఆర్‌లు రెండు మార్లు వారి వారి నివాసాల్లో భేటీ అయినా.. సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. దీనికి పైన పేర్కొన్న విషయాలు మాత్రమే కాదు.. విబజన చట్టాన్నే తెలంగాణ పరో క్షంగా వ్యతిరేకిస్తోంది. ఈ చట్టంలో అసలు జనాభా ప్రాతిపదికన ఆస్తులు పంచుకోవాలన్న విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ప్రకృతి వనరులు, సహజ సంపద ఆధారంగా ఆస్తులు పంచాలన్నది తెలంగాణ డిమాండ్. అలాగని హైదరాబాద్‌లో వాటా అడిగేందుకు మాత్రం తెలంగాణ ఒప్పుకోవడం లేదు.
అంటే.. ఒక రకంగా.. తెలంగాణ సర్కారు వాదన ఎలా ఉందంటే.. ''నీ కంట్లో నా వేలు పెడతా.. నా నోట్లో నీ వేలు పెట్టు'' అన్న చందంగానే ఉంది. నీటి వాటా నుంచి ఆస్తుల పంపకం.. విద్యుత్ బకాయిల చెల్లింపు.. ఇలా అన్నింటిలోనూ అసంబద్ధమైన అంశాలను ఆనాడు కేసీఆర్ ప్రస్తావించారు. ఫలితంగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి ఇప్పుడైనా రేవంత్ ముందు చూపుతో వ్యవహరిస్తారో.. లేక రాజకీయ వ్యూహాలతోనే ముడిపడి ఉంటారో చూడాలి.