విశాఖ ఉత్తరంలో కూటమికి అదే టెన్షన్..!
ఈ సమయంలో విశాఖలో ఓ మహిళా అభ్యర్థితో తలనొప్పి స్టార్ట్ అయ్యింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కూటమికి గాజు గ్లాసు రూపంలో ఊహించని టెన్షన్ వచ్చిన సంగతి తెలిసిందే! ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కలిగి ఉన్న జనసేన కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. అయితే... ఈ గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం వద్ద ఫ్రీ సింబల్ గా ఉండటంతో పలు నియోజకవర్గాలలో చాలా మంది ఇండిపెండెంట్లు దాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో విశాఖలో ఓ మహిళా అభ్యర్థితో తలనొప్పి స్టార్ట్ అయ్యింది.
అవును... జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్లా గాజు గ్లాసు అనేది ఫ్రీ సింబల్ అని ఈసీ నిర్ణయించడంతో కూటమిలో భారీ అలజడి రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తు మీద ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు ఓ మహిళా అభ్యర్థి. ఈ క్రమంలో ఆమె ఇంటింటికీ తిరుగుతూ తనను గెలిపించాలని.. ప్రజలంతా గాజుగ్లాస్ కి ఓటేయాలని ప్రచారం చేసుకుంటున్నారు.
దీంతో కూటమిలో కొత్త టెన్షన్ పీక్స్ కి చేరింది. పైగా అక్కడ జనసేనకు మంచి ఓటు బ్యాంకే ఉండటంతో... విశాఖ ఉత్తరం స్థానం నుంచి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణు కుమార్ రాజు అలర్ట్ అయ్యారు. తక్కువలో తక్కువ వెయ్యి ఓట్లు గాజు గ్లాసుకు పడినా అది పెద్ద డ్యామేజ్ కిందే లెక్క అని గ్రహించి ఆమెతో మాట్లాడారట!
ఈ నేపథ్యంలో బుజ్జగింపులు సక్సెస్ అవ్వడంతోనో ఏమో కానీ... ఆమె పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు! తాను ప్రచారానికి దూరం అని.. తనకోసం అనుకుని గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయవద్దని చెప్పించారు. ఇలా ఆమె పోటీ నుంచి లేరనే విషయం నియోజకవర్గ ప్రజలకు చేరడంతో కూటమి నేతలు కొంత ఉపశమనం పొందారనే చెప్పుకోవచ్చు!
అంతవరకూ బాగానే ఉంది కానీ... ఈవీఎంలలో గాజు గ్లాసు గుర్తు మాత్రం ఉంటుంది! దీంతో... తెలిసో తెలియకో ఎవరైనా ఆ గాజు గ్లాసు గుర్తును చూడగానే బటన్ నొక్కేస్తే ఆది కూడా సమస్యేకదా అనే ఆందోళన కూటమి కార్యకర్తల్లో మొదలైందంట! అందుకూ బలమైన కారణం ఉంది!
అదేమిటంటే... గడిచిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకి 18వేల పైచిలుకు ఓట్లు రాగా.. జనసేనకు 19వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో... ఈసారి ఫుల్ టఫ్ ఫైట్ అంటున్న నేపథ్యంలో ఆ 19వేల పైచిలుకు జనసేన ఓట్లలోనూ ఒక పదిశాతం పొరపాటున గాజు గ్లాసుకు పడితే పెను ప్రమాదమే అని ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మరి ఏమి జరగబోతుందనేది వేచి చూడాలి!