చిక్కడపల్లిలో తీగ లాగితే చైనా.. దుబాయ్ డొంక కదిలింది
వీరి మోసాల్ని తరచి చూసినప్పుడు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. వారు దోచే డబ్బులు ఉగ్రవాద కార్యకలాపాలకు సైతం వినియోగిస్తున్న వైనంతో అవాక్కు అయ్యే పరిస్థితి నెలకొంది.
వాట్సాప్.. టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే ఊరించే మెసేజ్ లకు స్పందిస్తే ఎంత ప్రమాదమన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. డబ్బు సంపాదన విషయంలో ఉండే బలహీనతలు.. ఆశల్ని అసరాగా చేసుకొని నిలువునా దోచేసే ఘరానా బ్యాచ్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. వీరి మోసాల్ని తరచి చూసినప్పుడు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. వారు దోచే డబ్బులు ఉగ్రవాద కార్యకలాపాలకు సైతం వినియోగిస్తున్న వైనంతో అవాక్కు అయ్యే పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ నగర పోలీసుల చాకచక్యంతో భారీ స్కాం ఒకటి బయటకు వచ్చింది. తక్కువ పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ప్రకటనలు చేస్తూ ఉదరగొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లకు పోలీసులు చెక్ పెట్టారు. దేశ వ్యాప్తంగా వేలాది మంది వద్ద దాదాపు రూ.712 కోట్లు దోచేసిన ఈ సైబర్ ముఠాను.. వారు చేసే మోసాల్ని చాకచక్యంతో వ్యవహరించి పట్టుకున్నారు. మరికొందరు నిందితులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. ఈ మొత్తం మోసాన్ని చూసినప్పుడు.. వాటి వివరాల్ని తెలుసుకున్నప్పుడు ముక్కున వేలేసుకునే పరిస్థితి.
చిక్కడపల్లికి చెందిన శివకుమార్ టెలిగ్రామ్ కు ఒక ప్రకటన వచ్చింది. దాని సారాంశం.. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు. అందరిలానే ఆకర్షితుడైన అతడు వెంటనే వెయ్యి పెట్టాడు. అంతే మొత్తంలో లాభం వచ్చింది. పెట్టుబడిని అంతకంతకూ పెంచుకుంటూ పోయాడు. చివరకు అది రూ.28లక్షల వరకు వెళ్లింది. దానికి ప్రతిఫలంగా డిజిటల్ రూపంలో లాభం భారీగా వచ్చినట్లుగా కనిపిస్తున్నా.. వాటిని తన అకౌంట్లోకి మార్చుకోవటానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండని పరిస్థితి. దీంతో తాను మోసపోయినట్లుగా భావించిన అతడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. కారణం.. ఈ కేసును విచారిస్తున్నకొద్దీ లింకులు భారీగా ఉండటమే కాదు.. దేశ వ్యాప్తంగా వీరి బాధితులు వేలల్లో ఉన్నట్లుగా గుర్తించారు. శివకుమార్ పోగొట్టుకున్న డబ్బులు మొత్తం ఆరు బ్యాంకుల్లో జమ అయినట్లుగా గుర్తించారు. ఆ ఖాతాల నుంచి 48 అకౌంట్లకు డబ్బులు బదిలీ కావటం.. ఈ ఖాతాల్లో కొంతకాలంగా రూ.584 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు.
లక్నో కేంద్రంగా ఉన్న 33 షెల్ కంపెనీలు 61 బ్యాంకు ఖాతాల్ని నిర్వహిస్తున్నాయని.. వాటిని సైబర్ నేరగాళ్లు వాడుతున్నట్లుగా గుర్తించారు. ఒక ఫోన్ నెంబరు ఆధారంగా హైదరాబాద్ కు చెందిన మహ్మద్ మునావరర్ అనే నిందితుడి చిరునామాను దొరకపుచ్చుకున్న పోలీసులు.. ఈ ముఠాకు చైనా.. దుబాయ్ తో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తంగా దేశ వ్యాప్తంగా 15 వేలమందిని మోసం చేసి.. వారి నుంచి దాదాపు రూ.712 కోట్లను దోచుకున్నట్లుగా తేల్చారు.
మునావర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారించగా మరో ఎనిమిది మంది నిందితులు లక్నో తదితర ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. వీరికి చెందిన షెల్ కంపెనీల్ని వాడుకునే చైనా ముఠా నుంచి కమిషన్ తీసుకున్నట్లుగా గుర్తించారు. అరెస్టు అయిన వారికి క్రిప్టో కరెన్సీ ఖాతాలు ఉండటమే కాదు.. దోచుకున్న మొత్తాన్ని చైనాకు పంపారు. అక్కడి నుంచి ఉగ్రవాదన సంస్థలకు నిధులు బదిలీ అవుతున్న వైనాన్ని గుర్తించి.. జాతీయ.. అంతర్జాతీయ విచారణ సంస్థలకు వివరాల్ని అందించారు. ఈ కేసు లోతుల్లోకి మరింత వెళితే.. మరిన్ని షాకింగ్ అంశాలు వెలుగు చూసే వీలుందన్న మాట వినిపిస్తోంది.