వైసీపీలో గుడ్డు ఐటీ మంత్రి ..టీడీపీలో కంపెనీ పేరు చెప్పని పరిశ్రమల మంత్రి !

ఆయన ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా చుట్టుముట్టి ఏపీకి కొత్త పరిశ్రమలు ఎపుడు తెస్తున్నారు అని ప్రశ్నించారు.

Update: 2024-08-01 03:00 GMT

మంత్రులు డైనమిక్ గా ఉండాలనుకుని మీడియాకు దొరికేస్తూంటారు. తాము కొత్తగా మాట్లాడుతున్నామని నూతనంగా ఆలోచిస్తున్నామనుకుని ట్రోల్స్ కి గురి అవుతూంటారు. గతంలో వైసీపీ ఏలుబడిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఉన్నారు. ఆయన ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా చుట్టుముట్టి ఏపీకి కొత్త పరిశ్రమలు ఎపుడు తెస్తున్నారు అని ప్రశ్నించారు.

దానికి గుడివాడ అమర్నాధ్ కాస్తా వెరైటీగా ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ అపుడే పరిశ్రమలు అంటే ఎలా గుడ్డు పొదగాలి కోడి గుడ్డు పెట్టాలి అంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. అది కాస్తా టోటల్ గా బూమరాంగ్ అయింది. సోషల్ మీడియాలో ఒక్కటే ట్రోలింగ్ నడిచింది. పరిశ్రమలు ఏపీకి ఎన్ని వచ్చాయంటే కోడి గుడ్డు అంటారేంటి మినిస్టర్ గారు అని తెగ చెడుగుడు ఆడేసుకున్నారు. ఆయనకు గుడ్డు మంత్రి అన్న పేరు స్థిరపడిపోయింది.

ఇపుడు టీడీపీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్ కి ఛాన్స్ ఇచ్చారు. ఆయన కూడా మీడియా ముందు కొత్తగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఏపీకి కొత్తగా ఒక పరిశ్రమ రాబోతోంది అయితే దాని పేరు మాత్రం చెప్పను అంటూ మీడియానే ఊరిస్తున్నారు.

ఏపీలో బీపీసీఎల్ తరువాత మరో భారీ పరిశ్రమ రాబోతోంది అని టీజీ భరత్ చెప్పారు. ఏకంగా డెబ్బై అయిదు వేల కోట్ల రూపాయాలతో ఈ పరిశ్రమ వస్తోందని ఆయన చెప్పారు. ఆ పరిశ్రమ పేరు ఏంటో చెప్పండి అంటే మాత్రం ఆసక్తికరమైన జవాబు చెప్పారు. అమ్మో అదొక్కటీ అడక్కు అన్న తీరున రియాక్ట్ అయ్యారు. గొప్ప సీక్రేట్ అని కూడా అన్నారు. అదేదో బ్రహ రహస్యం అయినంత బిల్డప్ ఇచ్చారు.

ఆ కంపెనీ పేరు చెబితే దానిని వల వేసి తీసుకుని పోవడానికి తమిళనాడు రాష్ట్రం సిద్ధంగా ఉందిట. అందుకే ఆ కంపెనీ పేరుని చెప్పనంటే చెప్పను అని మంత్రి గారు బిగుసుకుని కూర్చున్నారు. ఇక లాస్ట్ లో ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఆ కంపెనీ ఏర్పాటు అన్నది కన్ ఫర్మ్ అయిన తరువాతనే పేరు చెబుతాను అని. అంటే ఇంకా కన్ ఫర్మ్ కాలేదన్న మాట.

అయినా మంత్రి గారి దృష్టిలో ఇది సీక్రెట్ అయితే కావచ్చు ఆ కంపెనీకి సీక్రెట్ ఏముంటుంది అని అంటున్నారు. వారికి ఎక్కడ రాయితీలు బాగా ఇస్తారో చూసుకుని మరీ వెళ్ళి ఆయా రాష్ట్రాలలో పెట్టుబడులు పెడతారు. వల వేస్తే పడిపోవడానికి కంపెనీ చేప కాదు కాదు కదా అని సెటైర్లు పడుతున్నారు. ఇక మంత్రిగారే చెప్పినట్లుగా తమిళనాడు లాంటి స్టేట్ పోటీ పడుతుంటే ఆ గట్టి పోటీని ఎదుర్కోవడమూ కష్టమే కదా అని అంటున్నారు.

ఇవన్నీ చూస్తూంటే మంత్రులు వినూత్న ఆలోచనలు బాగానే ఉంటున్నాయి కానీ మీడియా ముందుకు వచ్చినపుడు జాగ్రత్తగా ఉండకపోతే ట్రోలింగ్ కి గురి అవుతామని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు. నిజానికి సీక్రెట్ అని భావించినపుడు మంత్రి గారు ఊరించకూడదు, ఊరించినపుడు పేరు చెప్పకుండా ఉండకూడదు. అంటే ప్రచారం కావాలి కానీ విషయం జనాలకు అక్కరలేదా వారు తెలుసుకోవాల్సిన పని లేదా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. స్మార్ట్ గా మంత్రులు ఉందామనుకుంటే అంతకంటే స్మార్టుగా జనాలు నెటిజన్లు ఉన్నారని తెలుసుకోవాలని అంటున్నారు.

Full View
Tags:    

Similar News