మొదలైంది దళపతి విజయ్ కీలక ప్రకటన!

ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో కార్యక్రమాలు నడుస్తున్నాయని అంటున్నారు.

Update: 2024-08-08 08:03 GMT

తమిళనాట 2026లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సరికొత్త పార్టీ భారీగా ఎత్తున రంగంలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎంతోకాలంగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న తమిళ సూపర్ స్టార్ విజయ్.. రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో కార్యక్రమాలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఆయన ఓ కీలక ప్రకటన చేశారు.

అవును... తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే... 2026లో అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనుంది. ఇప్పటికే విజయ్ మక్కల్ ఇయక్కం (విజయ్ ప్రజా సంస్థ) పేరుతో కొన్నేళ్లుగా ఆయన అభిమాన సంఘాలు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ కచ్చితంగా పెను ప్రభావమే చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన కూడా 2026 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... వచ్చే నెల 25న టీవీకే పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆ భారీ బహిరంగ సభలోనే పార్టీ గుర్తు, విధివిధానాలను ప్రకటించనున్నారు! దీంతో... విజయ్ మొదలుపెట్టేసినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ బహిరంగ సభ అనంతరం జిల్లాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు.. అనంతరం వరుసగా సభలు, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా సాగనున్నాయని అంటున్నారు.

కాగా... ఇటీవల పార్టీ పేరు నమోదు చేసిన అనంతరం స్పందించిన విజయ్... 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. పారదర్శకమైన జాతి, మత భేదాలకు తావులేని, అవినీతి రహిత సమాజ స్థాపన కోసం, రాజకీయ మార్పు కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఆ లోటు తీర్చడానికే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు!

Tags:    

Similar News