పొలిటికల్ 'స్టేషన్' గా మారనున్న సంచలనాల 'తాటికొండ'

బీఆర్ఎస్ సర్కారులో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్

Update: 2024-02-03 06:25 GMT

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన గురించి ‘తాటి’కాయంత అక్షరాలతో కథనాలు వచ్చేవి.. మహిళా నేతలను వేధించారని, అనుచితంగా మాట్లాడారని.. ఆయనకు ఈసారి టికెట్ కట్ అని.. గతంలోనూ అత్యంత ప్రాధాన్య దక్కినా ఆరోపణల కారణంగా పదవి పోగొట్టుకున్నారని.. ఇలా అనేక కథనాలు వచ్చేవి. దీనికితోడు నియోజకవర్గంలో ఆయనకు సొంత పార్టీలోనే సీనియర్ ప్రత్యర్థి ఉండడంతో ఉక్కపోతకు గురయ్యారు. అటు గెలిచిన పార్టీలో ఉండలేరు.. ఇటు గతంలో వీడి వచ్చిన పార్టీలోకి వెళ్లలేరు.. అలాగని గెలుస్తారని నమ్మకమూ లేదు.. అసలు ఆయన పార్టీనే గెలవలేదు.. అయితే, ఆయనకు చిరకాల ప్రత్యర్థి మాత్రం టికెట్ దక్కించుకుని విజయమూ సాధించారు.

ఆ స్టేషన్ లో అంతే..

బీఆర్ఎస్ సర్కారులో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ నియోజకవర్గం కాస్త ప్రత్యేకమైనది. ఎస్సీలకు రిజర్వుడ్ అయిన ఈ సీటులో మూడు దశాబ్దాలుగా మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. స్వతహాగానే సౌమ్యుడిగా పేరున్న ఆయనకు డెవలప్ మెంట్ పరంగానూ మంచి పేరుంది. దీంతో ఇక్కడినుంచి పలుసార్లు గెలుపొందారు. అలాంటి కడియంకు సవాల్ విసిరారు తాటికొండ రాజయ్య. మధ్యలో వచ్చిన ఉప ఎన్నికను కలుపుకొని స్టేషన్ నుంచి 2009 మొదలు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. 2014లో 58 వేలు, 2018లో 35 వేల మెజారిటీ సాధించారు. అయితే, 2018 తర్వాత రాజయ్య తీవ్ర వివాదాస్పదం అయ్యారు. తన ప్రవర్తన, వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీనికితోడు కడియం శ్రీహరితో కయ్యాలు మీడియాకు మాంచి మసాలా అందించాయి. చివరకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఇద్దరికీ సర్దిచెప్పింది. ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ కట్ చేసింది. శ్రీహరికి సీటివ్వగా ఆయన మంచి మెజారిటీతో గెలుపొందారు.

అసమ్మతిని వెళ్లగక్కుతూ..

తనకు సీటు దక్కకపోవడంపై తాటికొండ రాజయ్య లోలోపల తీవ్ర మధనపడ్డారు. మీడియాకు ఇంటర్వ్యూలూ ఇచ్చారు. అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి ఉంటే రాజయ్య పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. రాజయ్య బీఆర్ఎస్ ను కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. దీనికితగ్గట్లే ఆయన శనివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. లోక్‌ సభ ఎన్నికల వేళ ఈ పరిణామం చర్చనీయాంశమే. ఎందుకంటే వరంగల్ లోక్ సభ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. మరోవైపు తనపై వస్తున్న కథనాల గురించి రాజయ్య మీడియాతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరట్లేదన్నారు. ‘‘బీఆర్ఎస్ లో క్షోభకు గురయ్యా. నాకు గుర్తింపు లభించడం లేదు. అధినాయకత్వాన్ని కలిసే చాన్స్ రావడం లేదు. నియోజకవర్గంలో కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది. వారితో చర్చించి భవిష్యత్‌ పై నిర్ణయం తీసుకుంటా’’ అని మీడియాకు చెప్పారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చట్లేదని కూడా కుండబద్దలు కొట్టారు.

కాంగ్రెస్ నుంచి వచ్చి..

తాటికొండ రాజయ్య రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది. 2009లో ఆయన ఘనపూర్ నుంచి ఆ పార్టీ తరఫునే గెలిచారు. ఆ వెంటనే బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2012 ఉప ఎన్నికల నుంచి 2018 వరకు బీఆర్ఎస్ టికెట్ పైనే పోటీ చేశారు. తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా వార్తలపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సరికాదని.. తాను 15 ఏళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నానని వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ వివాదాల రాజకీయానికి హాల్ట్ రానున్నదన్నమాట.

Tags:    

Similar News