ఆ మంత్రి ఔట్.. మాజీ మహిళా ఎంపీకి చాన్స్!
కాగా ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంను ఈసారి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్నారు.. వైసీపీ అధినేత జగన్. ఇందులో భాగంగా ఇప్పటివరకు నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 58 అసెంబ్లీ, 10 లోక్ సభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
కాగా ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంను ఈసారి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ప్రస్తుతం జయరాం ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ రెండు విడతల మంత్రివర్గాల్లోనూ చోటు దక్కించుకున్న మంత్రుల్లో ఒకరిగా నిలిచారు.
కాగా వచ్చే ఎన్నికల్లోనూ గుమ్మనూరు జయరాం మరోసారి అసెంబ్లీకే పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఇటీవల గాసిప్స్ వినిపించాయి. వైసీపీ ముఖ్య నేతలకు సైతం అందుబాటులోకి రావడం లేదని.. ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని టాక్ నడిచింది.
ఈ నేపథ్యంలో గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని.. అధికారిక ప్రకటన చేయడమే తరువాయి అని అంటున్నారు. నేడో రేపో ఈ మేరకు అధికారికంగా గుమ్మనూరు జయరాంను కర్నూలు అభ్యర్థిగా తప్పిస్తూ ప్రకటన విడుదల చేస్తారని చెబుతున్నారు.
అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానంలో మార్పు ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డిపై గెలుపొందారు. అయితే చెన్నకేశవరెడ్డికి ఇప్పటికే వయసు 80 ఏళ్లకు పైబడటంతో ఆయనకు ఈసారి జగన్ టికెట్ నిరాకరించారు. తన కుమారుడికి సీటు ఇవ్వాలని ఆయన కోరినా ఇవ్వలేదు. అయితే వారు సూచించిన మాచాని వెంకటేశ్ కు సీటు ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా వెంకటేశ్ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది.
అయితే మాచాని వెంకటేశ్ అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గంలో వైసీపీ నేతలు, శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేయకపోవడం, తదితర కారణాలతో ఇప్పుడు ఆయనను తప్పించి మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు సీటును ఖరారు చేశారని అంటున్నారు.
బుట్టా రేణుక 2014లో కర్నూలు నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కొంతకాలానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్లీ 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో రేణుకకు ఎక్కడా సీటు దక్కలేదు. కర్నూలు జిల్లా వైసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాత్రమే ఇన్నాళ్లూ కొనసాగారు. ఇప్పుడు ఎమ్మిగనూరు సీటును ఆమెకు జగన్ ఖరారు చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా జారీ చేస్తారని సమాచారం.