కో ఆర్డినేషన్ మీటింగుల కంటే పవన్ గురించి ఆ ఒక్క మాట చాలుగా..?

టీడీపీకి పొత్తులు కొత్త కాదు కానీ జనసేన వంటి పార్టీతో పొత్తు మాత్రం పూర్తిగా కొత్తగానే ఉంది.

Update: 2023-11-16 17:28 GMT

ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తు పై స్థాయిలో ఖరారు అయింది. దాన్ని దిగువ స్థాయిలో ఎలా అమలు చేయాలన్నది మాత్రం అగ్ర నేతలకు అర్ధం కావడం లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. టీడీపీకి పొత్తులు కొత్త కాదు కానీ జనసేన వంటి పార్టీతో పొత్తు మాత్రం పూర్తిగా కొత్తగానే ఉంది.

ప్రజలలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న నేత పవన్ కళ్యాణ్. సామాజికపరంగా బలమైన నేపధ్యం ఉంది. పైగా పవన్ సీఎం కావాలని ఏపీలో అత్యధిక శాతం ఓటు బ్యాంక్ ఉన్న బలమైన సామాజిక వర్గం కోరుకుంటోంది. పవన్ కి కూడా సీఎం గా చేయాలని ఉంది. దాంతో ఈ రెండు పార్టీలను ఒక్కటిగా ఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేసేది ఎలా అన్నదే అంతు పట్టడంలేదు అని అంటున్నారు.

ఇక పై స్థాయిలో అంటే రష్ట్ర స్త్యాయిలో ద్వితీయ శ్రేణి నేతల మధ్యన కో ఆర్డినేషన్ మీటింగ్స్ జరిగాయి. ఇక అది కాస్తా ఇపుడు నియోజకవర్గాల స్థాయిలో ఆత్మీయ సదస్సుల పేరిట సాగుతోంది. కొన్ని చోట్ల అయితే అది రాజకీయ రచ్చకు దారి తీస్తోంది. తాము ఎమ్మెల్యే అభ్యర్ధులుగా నిలబడాలని జనసేన నుంచి కొందరు కీలక నేతలు భావిస్తున్నారు.

అక్కడ ముందు నుంచే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా సై అంటున్నారు. అలా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు జనసేన నేత శ్రీనివాస్ కి మధ్య రగడ కాస్తా జగడం గా మారింది. ఇక అనకాపల్లిలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. అయితే ఇక్కడ టీడీపీలో టికెట్ కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. జనసేనలో సేమ్ సీన్ ఉంది. ఎక్కడ నుంచో వలస వచ్చిన నాయకుడికి టికెట్ అంటే ఒప్పుకోమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అంతా కలసికట్టుగా పనిచేయాలని కోరుకున్నారు. ఎవరు అభ్యర్ధి అయినా ఎవరికీ టికెట్ ఇచ్చినా పనిచేయాలని కూడా చెబుతున్నారు. అయితే క్యాండిడేట్ తామే అవుతామని రెండు పార్టీలలో ఆశావహులు అనుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి సరేనని అంటున్నారు. కానీ నిజంగా అలా జరుగుతుందా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న.

సహజంగానే టీడీపీ వారే ఎక్కువ సీట్లలో అభ్యర్ధులు ఉంటారు. జనసేనకు కొన్ని సెలెక్టివ్ సీట్లు మాత్రమే ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. దాంతో ఇపుడు జరుగుతున్న రాజకీయ రచ్చలు పీక్స్ కి వెళ్తాయని అపుడు పొత్తు పార్టీలు రెండింటికీ ముప్పు అని అంటున్నారు. అలా కాకుండా అభ్యర్ధులు ప్రకటించిన తరువాత రెండు పార్టీలను కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తే ఒక అర్ధం అందం అని అంటున్న వారూ ఉన్నారు.

జనసేన విషయం తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లకు గానూ మెజారిటీ సీట్లు కోరుకుంటోంది. అంటే కనీసంగా 20 దాకా సీట్లు అన్న మాట. అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలలో మరో 34 సీట్లు ఉన్నాయి. ఇక్కద కూడా జనసేన ఉమ్మడి విశాఖలో అరడజన్ కి తక్కువ కాకుండా అలాగే విజయనగరం శ్రీకాకుళంలో చెరి మూడు సీట్లు వంతున టోటల్ గా కలిపి కనీసంగా డజన్ సీట్లు కోరుకుంటోందని టాక్ నడుస్తోంది.

అయితే మొత్తంగా ఈ 68 సీట్లలో జనసేనకు ఎన్ని దక్కుతాయంటే ప్రస్తుతానికి అది సస్పెన్స్ గానే ఉంది. ఓవరాల్ గా పదిహేను నుంచి ఇరవై పరిమితం చేయాలని టీడీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఆ మీదట మిగిలిన ఉమ్మడి జిల్లాలు ఏడింటిలో తలా ఒక్క సీటు వంతున ఇచ్చి మొత్తంగా పాతిక ముప్పయి సీట్ల లోపే ముగిద్దామని చూస్తోంది అని అంటున్నారు. ఇక జనసేన కోరుకుంటే ఎంపీ సీట్లు ఒకటి రెండు ఎక్కువ ఇస్తారని తప్పిస్తే అసెంబ్లీలో మాత్రం 30 దగ్గరే నంబర్ లాక్ చేస్తారని అంటున్నారు.

అదే కనుక జరిగితే మాత్రం ప్రస్తుతం కో ఆర్డినేషన్ మీటింగ్స్ పేరుతో జరుగుతున్న వాటి వల్ల ఉపయోగం లేదనే అంటున్నారు. ఎందుకంటే ఆశావహులే జనసేన నుంచి ఇంచార్జిలుగా ఉన్నారు. వారంతా రేపటి ఎన్నికల్లో నిలబడాలని చూస్తున్నారు. కొందరు అయితే గడచిన ఎన్నికల్లో టీదీపీకి ప్రత్యర్ధులుగా నిలబడి కత్తులు దూసుకున్న వారే అని గుర్తు చేస్తున్నారు.

మరి దీనికి పరిష్కారం ఎలా అన్నదే చూడాలని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో గెలుపు రెండు పార్టీలకూ ముఖ్యం కాబట్టి జనసేనను జూనియర్ పార్టనర్ గా కాకుండా సాటి మిత్రపక్షంగా తీసుకుని ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తేనే కో ఆర్డినేషన్ బాగుంటుందని అంటున్నారు.

అంతే కాదు పవన్ ని సీఎం గా చేస్తామని అధికారంలో జనసేనకు కనీసం రెండేళ్ల వాటా ఇస్తామని చెబితే ఈ కో ఆర్డినేషన్ మీటింగులు పెట్టకపోయినా కూడా జనసేన పూర్తిగా జై కొడుతుందని, బలమైన సామాజిక వర్గం కూడా టీడీపీ వెంట నిలుస్తుందని అంటున్నారు. మరి ఆ హామీ ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉందా అన్నదే చర్చగా ఉంది. ఆ ఒకే ఒక్క మాట చెబితే ఇన్ని గొడవలు ఉండవలు కదా అని అంటున్నారు.

Tags:    

Similar News