అలిగినా దోశలేస్తూ.. గరిట తిప్పడూ మంత్రి గారి క్యాంపెయిన్...!
ఈ టికెట్ ఇచ్చినప్పుడు కొంత షాక్‌కు గురైన చెల్లుబోయిన.. వెళ్లబోనని భీష్మించారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కించుకున్న వారు.. తమకు కేటాయించిన నియోజకవర్గాలపై ఒక అంచనాకు వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో విజిట్ చేస్తున్నారు. కొందరు కేడర్ సహకారం కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొందరు.. మాత్రం ముందు ప్రజలను ప్రసన్నం చేసుకుందాం.. మన మొహం వారికి చూపిద్దాం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివారిలో మంత్రి చెల్లుబోయిన వేణు.. తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబో యినకు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టికెట్ ఇచ్చినప్పుడు కొంత షాక్‌కు గురైన చెల్లుబోయిన.. వెళ్లబోనని భీష్మించారు. టీడీపీ కేడర్ ఎక్కువ.. వరుసగా ఆ పార్టీనే గెలిచింది.. ఇప్పుడు అక్కడ నన్ను ఎవరు చూస్తారు? అని సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గర పంచాయతీ కూడా పెట్టారు. కానీ.. పార్టీ ఇంతకు మించి చేసేది లేదని తేల్చేసింది.
దీంతో మంత్రి చెల్లుబోయిన తప్పదని భావిస్తూనే.. తనదైన శైలిలో ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. బీసీలను ఆకట్టుకునేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందుగానే ఆయన ఇక్కడ క్యాంపెయిన్ ప్రారంభించేశారు. నియోజకవర్గంలోకి అడుగు పెడుతూనే.. తన కారును, కాన్వాయ్‌ను పక్కన పెట్టేసి.. నడుచుకుంటూ.. తిరుగుతున్నారు. రోడ్డు పక్క చిరు వ్యాపారాలు చేసుకునేవారిని పలకరిస్తున్నారు. వారితో మమేకం అవుతున్నారు.
ఈ క్రమంలో రోడ్డు పక్కన టిఫెన్ బళ్లు పెట్టుకునే వారి దగ్గరకు వెళ్లి.. పెనంపై దోశలు పోస్తున్నారు. సాం బారు కాస్తుంటే.. తాను కూడా ఓ చెయ్యేసి.. గరిటె తిప్పుతున్నారు. గ్రైండర్లో పిండి రుబ్బుతుంటే.. తాను కూడా.. చెయ్యేసి.. పిండి తీయడం వంటివి ఊరమాస్ చర్యలు చేస్తున్నారు. దీనిని కవర్ చేసేందుకు ఓ వర్గం మీడియాను కూడా.. ఆయన వెంట తిప్పుకోవడం గమనార్హం. దీంతో మంత్రిగారి ప్రచార పదనిసలు .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. నియోజకవర్గంలో కీలకమైన సమస్యలు ఉన్నాయని.. వాటిపై స్పందించాలని.. స్థానికులు షాకిస్తున్నారు. మరి మంత్రిగారి దోశెల రాజకీయం ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.