కూటమి ముందు సీపీఎస్ సైరన్ ?

దానికి తోడు అన్నట్లుగా గ్యారంటీ పెన్షన్ స్కీం అనబడే జీపీఎస్ ని తెచ్చి మరింత ఆగ్రహానికి గురి అయింది నాటి వైసీపీ ప్రభుత్వం.

Update: 2024-07-13 17:40 GMT

ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా మారడానికి పూర్తి స్థాయిలో దోహదపడిన అంశాలలో అతి ముఖ్యమైనది సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి అమలు చేయకపోవడం. దానికి తోడు అన్నట్లుగా గ్యారంటీ పెన్షన్ స్కీం అనబడే జీపీఎస్ ని తెచ్చి మరింత ఆగ్రహానికి గురి అయింది నాటి వైసీపీ ప్రభుత్వం. జీపీఎస్ వద్దు మొర్రో అని ఉద్యోగులు గొంతెత్తారు. అయినా లెక్క చేయలేదు.

దాని వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి మరి శాంతపరచడానికి చూశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులు లేనప్పుడు చేసిన ప్రసంగాలలో సీపీఎస్ రద్దు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారని ప్రచారంలో ఉంది. ఆ తరువాత పొత్తులు కుదిరాక మాత్రం పవన్ ఎక్కడా ఆ మాట అనలేదు.

అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు మీదనే నిలబడి ఉన్నారు. 2004 నుంచి ఉమ్మడి ఏపీలో అమలులో ఉన్న సీపీఎస్ ని విభజన ఏపీలో అయినా రద్దు చేయించుకోవాలని తొలి ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశారు. కానీ సీపీఎస్ రద్దు కాలేదు. ఆ తరువాత మలి ఎన్నికల్లో జగన్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. జగన్ పాదయాత్ర వేళ సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారు.

తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన వారం రోజుల వ్యవధిలోనే సీపీఎస్ ని రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆ విషయాన్ని మాత్రం పక్కన పెట్టింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక చర్చలు చేసిన మీదటను జీపీఎస్ ని అమలు చేస్తున్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దానిని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పూర్తిగా వ్యతిరేకించాయి.

ఈ పరిణామాల క్రమంలో 2024 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగ వర్గం అంతా అవుట్ రేట్ గా టీడీపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. దాంతో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ద్వారా సీపీఎస్ రద్దు డిమాండ్ ని నెరవేర్చుకోవాలని ఉద్యోగులు చూశారు. అయితే ఇంకా ఆ విషయంలో అనుకున్నది ఏదీ జరగకముందే చంద్రబాబు ప్రభుత్వం కూడా జీపీఎస్ కే మొగ్గు చూపుతోంది అని అంటున్నారు.

దీంతో ఉద్యోగ సంఘాల నేతలు అంతా మండిపడుతున్నారని అంటున్నారు. జీపీఎస్ వద్దు అంటే దానినే కొత్త ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని అంటున్నారు. తమకు కావాల్సింది జీపీఎస్ లు సీపీఎస్ లు కాదని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని వారు అంటున్నారు. దాని కోసం ఎంతదాకా అయినా వేళ్తామని అంటున్నారు.

సీపీఎస్ రద్దుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి డిమాండ్ వస్తోంది. దీని మీద ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పోస్టింగుల ఉద్యమం మొదలైంది. ఇక అన్నీ చూసుకుని సరైన ముహూర్తంలో ఉద్యోగులు సమావేశాలు నిర్వహించి కార్యాచరణకు సిద్ధం కావడమే తరువాయి అని అంటున్నారు.

అయితే సీపీస్ రద్దు అన్నది కూటమికి తలకు మించిన భారం అని అంటున్నారు అది సంపన్న రాష్ట్రాలు ఆదాయం బాగా వచ్చే చోటనే అమలు చేయలేరని, ఇది కనుక అమలు చేస్తే ఏదో నాటికి ఖజానా దివాళా తీసినా జీతాలు చెల్లించే పరిస్థితి ఉండదని అంటున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం ఉద్యోగులు పట్టుదలగానే ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News