టీడీపీ -జనసేన ప్రభుత్వం జగన్ మీద పెట్టే తొలి కేసు ఇదేనా?
పవన్ వార్నింగ్ కు ముందు.. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు అన్న చందంగా మారింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు. కొన్ని సందర్భాల్లో విలువల గురించి.. సిద్ధాంతాల గురించి మాట్లాడే ఆయన.. మరికొన్ని సందర్భాల్లో వాటి ఊసుతో సంబంధం లేని మరికొన్ని అంశాల్నిప్రస్తావిస్తుంటారు. తాజాగా అలాంటి అంశాల్ని టచ్ చేసిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తాము నమోదు చేసే కేసు గురించి పవన్ చేసిన వ్యాక్యలు ఆసక్తికరంగా మారాయి.
జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకంలో రూ.743 కోట్ల స్కాం జరిగిందని.. ఎన్నికల తర్వాత ఈ కుంభకోణం మీదనే దర్యాప్తు చేస్తామని వ్యాఖ్యానించారు. ఏపీ విద్యా శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని.. 2024 ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే ఈ స్కాం మీదనే మొదటి దర్యాప్తు జరుగుతుందని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.
పవన్ వార్నింగ్ కు ముందు.. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. అమ్మఒడి పథకంలో పెద్ద స్కాం జరిగిందన్నారు. అనంతరం మాట్లాడిన పవన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించి.. మరో అడుగు ముందుకేసి.. జగన్ మీద కేసు కడతామన్న రీతిలో మాట్లాడారు.
అమ్మఒడిలో స్కాం ఏం జరిగిందన్న దానిపై పవన్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం జరిపిన సర్వే వివరాల ఆధారంగానే తాను మాట్లాడుతున్నట్లు చెప్పిన పవన్.. 2022 సెప్టెంబరు నుంచి 2023 ఆగస్టు మధ్య వరకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 4.48 లక్షల మంది వెళ్లిపోయారన్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం42.61 లక్షల విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చినట్లుగా చెబుతుందని.. మరి.. అలాంటప్పుడు మిగిలిన విద్యార్థుల సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే తేడా ఉన్న 5.71 లక్షల విద్యార్థుల సంగతేమిటి? అని ప్రశ్నించారు. అమ్మఒడి పెద్ద స్కాం అంటున్న పవన్.. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల ముందే.. తాము గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. సీఎం జగన్ మీద ఏం కేసు నమోదు చేయాలన్న దానిపై చెబుతున్న మాటలు ఆసక్తికరంగా మారాయి. మరి.. దీనికి వైసీపీ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.