ప్రపంచంలో తొలిసారి.. కన్నును మార్చిన వైద్యులు
అత్యంత అరుదుగా ప్రపంచంలోనే తొలిసారి ఈ అవయవాల మార్పిడి జరిగిందనే విషయాలూ తెలుసుకున్నాం.
మనుషుల్లో గుండె, కిడ్నీ ఇతర అవయవాలను వైద్యులు మార్చారనే వార్తలను మనం విన్నాం. అత్యంత అరుదుగా ప్రపంచంలోనే తొలిసారి ఈ అవయవాల మార్పిడి జరిగిందనే విషయాలూ తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అలాంటి మరో అరుదైన ఘనతను వైద్యులు సొంతం చేసుకున్నారు. అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా ఓ వ్యక్తి కంటిని మార్చివేసిన న్యూయార్క్ వైద్యులు తొలిసారి ఈ ఘనత అందుకుని రికార్డు నమోదు చేశారు.
ఇప్పటివరకూ కంటి చూపు, అంధత్వం, లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పడి వంటి చికిత్సలను వైద్యులు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఓ వ్యక్తి కంటిని పూర్తిగా మార్చలేరు. ఇప్పుడీ ఘనతను న్యూయార్క్ వైద్యులు సొంతం చేసుకున్నారు. పూర్తిగా ఓ వ్యక్తి కంటిని మార్చివేసి రికార్డు నమోదు చేశారు. ఇలాంటి శస్త్రచికిత్స ప్రపంచంలోనే తొలిసారి అని చెబుతున్నారు. అయితే ఈ కన్ను ద్వారా చూపు వస్తుందా? లేదా? అనేది ఇంకా తేలలేదు. త్వరలోనే ఫలితం వచ్చే అవకాశముంది.
హై వోల్టేజీ ఉన్న కరెంటు తీగలు తగిలి ఆరన్ జేమ్స్ అనే వ్యక్తి ముఖం చాలా వరకు కాలిపోయి ఒక కన్ను మొత్తం పోయింది. దీంతో కుడి కంటిని రెప్పతో సహా మొత్తం మార్చేస్తే ఆయన ముఖానికి కొత్త రూపు వస్తుందని న్యూయార్క్ సిటీలోని లాంగోన్ హెల్త్ ఆసుపత్రి వైద్యులు భావించారు. దీంతో మే నెలలో 21 గంటల సేపు ఆపరేషన్ చేసి విజయవంతంగా కొత్త కన్ను పెట్టారు. ఇప్పుడది ఆరోగ్యంగా ఉందని వైద్యులు తాజాగా ప్రకటించారు. ఈ కన్నును మూయడం, తెరవడం సాధ్యం కాకపోయినా కంటిపై స్పర్శ మాత్రం తెలుస్తోందని జేమ్స్ చెప్పారు. దీని పూర్తి ఫలితం త్వరలో వెల్లడి కానుంది.