తనపై గెలిచిన ప్రత్యర్థిని పరామర్శకు రావొద్దన్న మాజీ సీఎం?

ఫలితాలతో ఇంటికే పరిమితమైన నాయకుడు అనూహ్యంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

Update: 2024-01-10 10:30 GMT

అనామక అభ్యర్థిగా పోటీకి దిగి.. అత్యంత సంచలన ఫలితం సాధించిన ఆ నాయకుడికి.. తన చేతిలో ఓడిన కీలక నేతను పరామర్శించబోతే అనూహ్య పరిణామం ఎదురైందా..? ఇప్పుడు కలిసే ఉద్దేశం లేదని అటునుంచి సమాధానం వచ్చిందా..? దీనికి ఔననే సమాధానమే వస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవలి ఎన్నికల సమయంలో ఓ నియోజకవర్గంలో పెను సంచలన ఫలితం వచ్చింది. ఇద్దరు పెద్ద నాయకులను ఓ జిల్లా స్థాయి నాయకుడు ఓడించారు. అది కూడా పెద్దగా బలంలేని పార్టీ నుంచి పోటీచేసి ఓడించారు. దీంతో ఈ ఫలితం దేశంలోనే సంచలనమైంది. ఇక ఆ ఫలితాల అనంతరం ప్రభుత్వం మారింది.

చూస్తానంటే.. వద్దన్నారా?

ఫలితాలతో ఇంటికే పరిమితమైన నాయకుడు అనూహ్యంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. అయితే, ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆయనను పలువురు ప్రముఖులు భారీగా పరామర్శించారు. ఓ దశలో ఇక నన్ను కలిసేందుకు ఎవరూ రావొద్దని విన్నవించారు. అనంతరం డిశ్చార్జి అయ్యాక కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తాను నివసించిన ఇంటికే పరిమితమయ్యారు.

అక్కడా పరామర్శల తాకిడి

శస్త్రచికిత్స అనంతరం గతంలో నివసించిన ఇంటికే పరిమితం అయిన నాయకుడికి అక్కడా పరామర్శలు తప్పడం లేదు. సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాలకు రాజ్యాంగ ప్రతినిధిగా పనిచేసినవారు సహా పలువురు వచ్చి కలుస్తున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యుడూ వచ్చి చూశారు. మరికొందరు కీలక పదవుల్లో ఉన్నవారూ ఆయనను చూసేందుకు వచ్చినట్లు సమాచారం. కాగా, ఎన్నికల్లో తనపై గెలిచిన నాయకుడికి మాత్రం ఈ అవకాశం కలగనట్లు సమాచారం. దీనికి ఆ నాయకుడు అంగీకరించకపోవడమే కారణమని తెలుస్తోంది. దీనికి.. తనపై గెలిచిన నాయకుడు తనను ఇలాంటి పరిస్థితుల్లో చూడడం ఇష్టం లేకనో.. మరే కారణమో తెలియదు.

ఒకప్పుడు ఆయన పార్టీలోనివారే..

ఇటీవలి ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆ నాయకుడు.. ప్రస్తుతం శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న నాయకుడి పార్టీలో గతంలో పనిచేసినవారే కావడం గమనార్హం. తర్వాత పరిణామాల్లో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సొంత కరిష్మాతో ప్రజల్లో ఆదరణ సంపాదించారు. చివరకు ఒకప్పటి తాను పనిచేసిన పార్టీ అధినేతనే ఓడించారు. దీంతోపాటు బోనస్ గా మరో రాష్ట్ర స్థాయి నాయకుడినీ ఓడించారు.

Tags:    

Similar News