రెండు సీట్లు రేపిన రచ్చ... అచ్చెన్న నిలదీత!
ఇన్ని రోజులూ టీడీపీ-జనసేన మధ్య పొత్తులో భాగంగా ఏమి జరుగుతుందో అర్ధంకాక జనసైనికులు తెగ టెన్షన్ పడిపోయేవారని అనేవారు.
ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత! టీడీపీ - జనసేన పొత్తుల మాటలు అయితే పూర్తయ్యాయి కానీ... ఇప్పటి వరకూ పొత్తులో భాగంగా ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేసేదే క్లారిటీ లేదు. ఇక ఏయే స్థానాలు ఎవరివనేది తేలనే లేదు! ఈ లోపే పొత్తులో రచ్చ మొదలైంది. ఎవరు రాజేశారు.. ఇంకెవరు ఆజ్యం పోశారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఇప్పుడు టీడీపీలో ఇది తీవ్ర సమస్యలకు కారణభూతం అయ్యేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇన్ని రోజులూ టీడీపీ-జనసేన మధ్య పొత్తులో భాగంగా ఏమి జరుగుతుందో అర్ధంకాక జనసైనికులు తెగ టెన్షన్ పడిపోయేవారని అనేవారు. ఈ క్రమంలో... "నన్నేమీ అడగవద్దు, వ్యూహం నాకు వదిలేయండి, మీరు మాత్రం కూటమికి ఓట్లు వేయండి, అలా కాకుండా నన్ను ఎవరైనా సందేహించినా, ప్రశ్నించినా వారు వైసీపీ కోవర్టులు అనుకుంటాను అని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏకంగా వీరి సీట్ల పంచాయతీ రోడ్డెక్కింది!
ఇందులో భాగంగా... టీడీపీ మిత్రధర్మం పాటించకుండా సీట్లు ప్రకటించారంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... టీడీపీ చేసిన ప్రకటనకు ప్రతిగా తాను రెండు సీట్లు ప్రకటిస్తున్నానంటూ... రాజోలు, రాజానగరం స్థానాల పేర్లు ప్రకటించారు. దీంతో... ఈ విషయంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నిలదీశారు.
అవును... జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజోలు, రాజానగరం సీట్లలో తమ అభ్యర్థులు పోటీచేస్తారని ప్రాకటించడంతోపాటు.. పిఠాపురంలోనూ జనసేన అభ్యర్థులే పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో... ఆ సీట్లు ఆశిస్తున్న నేతలకు మద్దతుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పలువురు కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ క్రమంలో ప్రధానంగా రాజోలు సీటు జనసేకు ఇవ్వటంపై ఆందోళనకు దిగారు.
వాస్తవంగా రాజోలు నుంచి సీనియర్ నేత, మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి సీట్లు ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... తాజాగా పవన్ కల్యాణ్ మాత్రం ఆ రెండు సీట్ల నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఈ నేతలు, వీరి అనుచరులు భగ్గుమన్నారు! తమతో ఏమాత్రం సంప్రదింపులు జరపకుండానే, పార్టీలో ఎలాంటి చర్చ చేపట్టకుండానే ఇలా అర్ధాంతరంగా ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహించారని తెలుస్తుంది.
దీంతో వారిని సముదాయించే ప్రయత్నం చేసిన అచ్చెన్నాయుడు... ఎవరూ ఆందోళన చెందొద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గొల్లపల్లి అనుచరులు శాంతించలేదని తెలుస్తుంది. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నేతలూ గొల్లపల్లికి సంఘీభావంగా నినాదాలు చేశారు. ఈ సారి రాజోలు టిక్కెట్ గొల్లపల్లికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా... ఈసారి రాజోలు టిక్కెట్ గొల్లపల్లికి ఇస్తే... సీఎం జగన్ అయినప్పటికీ తమకు ఎమ్మెల్యేగా మాత్రం గొల్లపల్లే కావాలంటూ వైసీపీలోని ఒక వర్గం కూడా భావిస్తుందంటూ చర్చ జరుగుతుందని తెలుస్తుంది.
ఇదే సమయంలో... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం పిఠాపురం లోనూ తమ్ముళ్లు ఫైరవుతున్నారు. పిఠాపురం టిక్కెట్ జనసేనకు అనే చర్చ తెరపైకి వస్తున్న వేళ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. నియోజకవర్గంలో జనసేన నేలను, కార్యకర్తలను ఆహ్వానించకుండానే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో... జనసేనతో పొత్తు పంచాయతీ వల్ల.. టీడీపీ పరిస్థితి రెబల్స్ తయారీ కేంద్రంగా మారే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు!