తెలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పార్టీ’ల ఆఖరి మజిలీ విలీనమేనా..?
విజయశాంతి రాజకీయాల్లోకి రావడమే అనూహ్యం అనుకుంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయమంటూ పార్టీని స్థాపించారు.
తెలుగు రాష్ట్రాలను రాజకీయంగా చైతన్యవంతం అయినవిగా చెప్పుకోవాలి. డెవలప్ మెంట్ పరంగా మంచి ప్రోగ్రెస్ ఉంటేనే ప్రజలు వరుసగా రెండోసారి అధికారం ఇచ్చే పరిస్థితి ఉందిక్కడ. లేదంటే ఒక్కసారికే వెనక్కు పంపుతున్నారు కూడా. ఇలాంటి ఉదాహరణలు గత 20ఏళ్లలో చూస్తున్నాం.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ వరుసగా రెండుసార్లు సీఎంలు అయ్యారు. ఇక పార్టీల పరంగా చూస్తే గత 25 ఏళ్లలో ఆవిర్భవించినవి బోలెడు. వాటిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్-తర్వాత బీఆర్ఎస్), వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే అధికారాన్ని అందుకున్నాయి. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ వంటి హోదా పొందిన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన తూళ్ల దేవేందర్ గౌడ్ నెలకొల్పిన పార్టీలు తర్వాత మరోపార్టీలో విలీనం అయిపోయి కాలగర్భంలో కలిసిపోయాయి.
ఆ ఫైర్ బ్రాండ్..
ఇక గత 25 ఏళ్లలో మహిళా పార్టీల విషయానికి వస్తే సినిమాల్లో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ‘తల్లి తెలంగాణ’ పేరిట రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. విజయశాంతి రాజకీయాల్లోకి రావడమే అనూహ్యం అనుకుంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయమంటూ పార్టీని స్థాపించారు. ఆపై ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ లో చేరారు. అందులోంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లోకి వెళ్లారు. మళ్లీ బీజేపీ బాట పట్టి.. ఇటీవలి ఎన్నికల ముంగిట కాంగ్రెస్ కు జైకొట్టారు.
ఈ ఘన వారసురాలు
విజయశాంతి తర్వాత సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన మహిళ ఎవరంటే వైఎస్ షర్మిల అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న తన తండ్రి లెగసీని నమ్ముకుని, ఏపీలో అన్న వైఎస్ జగన్ ను ధిక్కరించి విచిత్రంగా తెలంగాణలో రాజకీయ పార్టీని నెలకొల్పారు. తండ్రి వైఎస్సార్ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రెండేళ్లు నడిపారు. 2021 జూలై 7న మొదలైన ఈ పార్టీ ప్రస్థానం ఈ ఏడాది జూలై నాటికి ముగిసిందనే చెప్పాలి. కాంగ్రెస్ లో విలీనం అనే ప్రతిపాదనను షర్మిల అంగీకరించడమే దీనికి కారణం. ఎంతో గొప్పగా కార్యాచరణ ప్రకటించిన షర్మిల ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనేలేదు. పార్టీని తాజాగా కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ముహూర్తం సిద్ధమైపోయింది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతలు స్థాపించిన మరో పార్టీ జాతీయ పార్టీలో విలీనం అయినట్లు అన్నమాట.