వరల్డ్ కప్ నెగ్గిన ఆసీస్ టీం మేనేజర్ మన అమ్మాయే... ఎవరీ ఊర్మిళ?
ఈ సమయంలో వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయంలో భారత్ వాటాకూడా ఉందంటూ ఒక ఫోటో వైరల్ అవుతుంది.
ఇటీవల ముగిసిన వన్ డే వరల్డ్ కప్ - 2023 ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీం ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ నుంచి ఇంకా అటు క్రీడాకారులు కానీ, ఇటు క్రికెట్ అభిమానులు కానీ తేరుకున్నట్లు లేదు! ఈ సమయంలో వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయంలో భారత్ వాటాకూడా ఉందంటూ ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఆసిస్ గెలుపొందిన వరల్డ్ కప్ ను పక్కనపెట్టుకుని ఒక మహిళ కూర్చుని ఉంది!
ఆసిస్ వరల్డ్ కప్ గెలవడంలో భారత మూలాలున్న ఒక మహిళ హస్తం కూడా ఉందని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమె పేరు ఊర్మిళా రోసారియో కాగా... ఆమె ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం మేనేజర్!
అవును... ఊర్మిళ (34) కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని కిన్నిగోలికి చెందిన ఐవీ, వాలెంటైన్ రొసారియో దంపతుల కుమార్తె. ఆమె తల్లిదండ్రులు ఖతార్ లోని దోహాలో పని చేస్తున్నప్పుడు ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఏడేళ్ల క్రితం భారతదేశానికి తిరిగి వచ్చి సకలేష్ పూర్ లో స్థిరపడ్డారు. అక్కడ వారు కాఫీ ఎస్టేట్ కొనుగోలు చేశారు. ఈలోగా, కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ నుండి బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన ఊర్మిళ ఆస్ట్రేలియాకు వెళ్లింది.
అనంతరం అక్కడ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు మేనేజర్ గా పనిచేసింది. దీంతో... ఒక నాన్–ఆస్ట్రేలియన్ కు టీం మేనేజర్ బాధ్యతలు అప్పగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఫుట్ బాల్ ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెట్ నుంచి కొన్ని నెలల పాటు విరామం తీసుకొని ఖతార్ లో ఫుట్ బాల్ స్టేడియం నిర్వాహణ బాధ్యతలు చూసుకున్న ఆమె... ఆ తరువాత మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చింది.
ఊర్మిళకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం అంట. స్కూలు రోజుల్లో క్రికెట్ కంటే బాస్కెట్ బాల్, టెన్నిస్ బాగా ఆడటంతోపాటు బంగీ జంపింగ్ అంటే చాలా ఇష్టపడేదంట. ఇదే క్రమంలో ఖతార్ టెన్నిస్ ఫెడరేషన్ లో ఆమె మూడు సంవత్సరాలు పనిచేసింది. ఈ నేపథ్యంలో... ఆస్ట్రేలియాలో ఆమె మొదట అడి లైడ్ క్రికెట్ జట్టుతో సుమారు మూడు సంవత్సరాలు పనిచేసింది. తర్వాత ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టుకు జట్టు మేనేజర్ గా మారింది.
ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఖతార్ నుండి ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తర్వాత, ఆస్ట్రేలియన్ పురుషుల క్రికెట్ జట్టును జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ఆమెను సీఏ కోరింది. క్రికెట్ ఆస్ట్రేలియా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఊర్మిళా 100శాతం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. వరల్డ్ కప్ విక్టరీలో తన హస్తం ఉందని ప్రపంచానికి తెలిపారు!
ఈ సందర్భంగా స్పందించిన ఊర్మిళ తండ్రి వాలంటైన్... ప్రపంచ కప్ అసైన్‌మెంట్ కోసమే ఆమె పురుషుల జట్టుతో పాటు వెళ్లిందని, త్వరలో మహిళల క్రికెట్ జట్టులో చేరతారని, అన్నీ అనుకూలంగా జరిగితే డిసెంబర్ లో భారత్ లో పర్యటించినప్పుడు వస్తానని చెప్పిందని చెబుతున్నారు! ఇక ఈ ఏడాది మార్చిలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన ఊర్మిళ... తన తండ్రితో కలిసి ఎస్టేట్ లో పనిచేసింది!