కౌంట్ డౌన్ @ 30 డేస్!!
ఎవరూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. ఎవరికెవరూ తీసిపోకుండానే కార్యక్రమాలు ముమ్మరం చేశాయి.
ఏపీలో రాజకీయ సెగలు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఎన్నికల యుద్ధం కొన సాగుతోంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత..అన్ని పార్టీల్లోనూ వేడి పుట్టింది. వాస్త వానికి దీనికి ముందే టీడీపీ వ్యూహాత్మకంగా రోజూ.. ప్రజల మధ్యే ఉంటూ వచ్చింది. ఇక, వైసీపీ కూడా.. నాయకులను, పార్టీ ఎమ్మెల్యేలను ప్రజల మధ్యే ఉంచింది. అంటే ఎన్నికల షెడ్యూల్‌కు ముందుగానే.. పార్టీలు అలెర్టయ్యాయి. ఎవరూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. ఎవరికెవరూ తీసిపోకుండానే కార్యక్రమాలు ముమ్మరం చేశాయి.
ఇక, ఇప్పుడు ప్రధాన ఎన్నికలకు సమయం చేరువైంది. మరో 30 రోజులు మాత్రమే గరిష్ఠంగా పార్టీలకు సమయం ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మే 13న ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఒకే రోజు పూర్తికానున్నాయి. దీనిని బట్టి.. ఏప్రిల్ 8 నుంచి మే 13వ తేదీకి గరిష్ఠంగా 35 రోజులు ఉన్నాయి. కానీ, దీనిలో సెలవులు.. ఒక రోజు కూలింగ్ పిరియడ్, నామినేషన్ల ఘట్టం వంటివాటిని లెక్కలోకి తీసుకుంటే.. మొత్తంగా 30 రోజులు మాత్రమే పార్టీలకు మిగిలాయి.
దీంతో పార్టీలకు ఈ 30 రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయన ఇంటిని కూడా మరిచిపోయారు. ఇక, వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఇదే పంథాలో ముందుకు సాగుతున్నారు. జనసేన అధినేత పవన్ కూడా.. దాదాపు ప్రజలమధ్యే ఉండేం దుకు.. ఈ 30 రోజుల్లో 20 రోజులు ప్లాన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. ప్రధాని మోడీ మూడు రోజుల పాటు ఏపీలో ఉండనున్నారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా 5 రోజులు, జేపీ నడ్డా 5 రోజులు, యూపీ సీఎం యోగి 2 రోజుల పాటు ఏపీకి కేటాయించారు. దీనిని బట్టి.. ఏపీలో వచ్చే 30 రోజుల్లో మైకులు పగిలిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఏదేమైనా.. ఈ 30 రోజుల్లోనే ఏపీ భవిష్యత్తు మారిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.