పెన్షన్లకు మేడే దెబ్బ...అమ్మో ఒకటో తారీకు !

మే నెల లో 13న పోలింగ్ ముందు ఆ ఎన్నికల క్రతువు గడచిపోతే ఆ మీదట జూన్ నెల పెన్షన్ విషయంలో ఏమి జరిగినా ఫర్వాలేదు అన్న ధోరణి కూడా ఉంది.

Update: 2024-04-30 18:13 GMT

సామాజిక పెన్షన్లకు తొలి రోజే గండి పడింది. ఏప్రిల్ నెలలో వాలంటీర్ల సేవలు రద్దు చేయడంతో పెన్షన్ ఫస్ట్ డే ఇవ్వలేకపోయారు. అది కాస్తా వారం పది రోజుల పాటు పంపిణీ ప్రహసనంగా సాగింది. ఇపుడు చూస్తే మే ఫస్ట్ నుంచే పెన్షన్లు ఇవ్వాలని విపక్షాలు పది రోజుల ముందు నుంచే డిమాండ్ చేస్తూ వచ్చాయి. వారి బాధ వారిది వాలంటీర్లను తాము డిమాండ్ చేసి తప్పించామని గిల్టీ ఫీలింగ్ ఏదో ఉంది. అది కాస్తా రాజకీయంగా తమకు ఇబ్బంది తెస్తుందన్న కంగారూ ఉంది. మే నెల లో 13న పోలింగ్ ముందు ఆ ఎన్నికల క్రతువు గడచిపోతే ఆ మీదట జూన్ నెల పెన్షన్ విషయంలో ఏమి జరిగినా ఫర్వాలేదు అన్న ధోరణి కూడా ఉంది.

ఏది ఏమైతేనేమి ఈసీతో చెప్పించి ఎలాగోలా పెన్షనర్లు రోడ్ల మీదకు రానీయకుండా ప్రభుత్వ ఉద్యోగులే ఇళ్ళ వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని విపక్షాలు డిమాండ్ ని నెరవేర్చుకున్నాయి. మొత్తం 66 లక్షలకు పైగా ఉన్న సామాజిక పెన్షన్ల విషయంలో అందరికీ ఇంటికి వెళ్ళి పంపిణీ చేయడం అంటే కుదరదు అని ప్రభుత్వం అంటోంది. అందుకే వారి బ్యాంక్ ఖాతాలకే పెన్షన్ జమ చేస్తామని బ్యాంక్ ఖాతాలు లేని వారికి అలాగే మంచం మీద ఉండి లేవలేని వారికి మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పింది.

దీని మీద విపక్షాలు అభ్యంతరాలు ఎలా ఉన్నప్పటికీ బ్యాంక్ ఖాతాలో జమ అయినా ఎలాగోలా తీసుకునేవారు. కానీ మే డే కారణంగా బ్యాంకులకు సెలవు అని దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు అలాగే కీలక ఉత్తర్వు వెలువడింది. అంటే తొలి రోజు మేడే దెబ్బ పెన్షనర్లకు పడింది అని అంటున్నారు. బ్యాంకులకు వెళ్లి మొత్తం తీసుకుని రావడం వాటిని వాలంటీర్లతో పంపిణీ చేయించడం అన్నది ఇదివరకు అయితే సచివాలయ స్థాయిలో చేసేవారు.

ఇపుడు చూస్తే అలా కాదు వాలంటీర్లు లేరు కాబట్టి సచివాలయ ఉద్యోగులు చేయాలి. వారు ఎన్నికల విధులలో బిజీగా ఉన్నారు. ప్రతీ వార్డు గ్రామ సచివాలయం పరిధిలో ఇద్దరు ముగ్గురు కంటే స్టాఫ్ లేరు. ఇక బ్యాంకులు చూస్తే సెలవు. దాంతో ఇపుడు పెన్షనర్లకు డబ్బులు తొలి రోజు పడే చాన్స్ లేదు అని తేలిపోతోంది. మరి రానున్న రోజులల్లో అయినా పడుతుందా బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తే వారు ఏ విధంగా తెచ్చుకోగలరు అన్నది కూడా ప్రశ్న.

ఏది ఏమైనా వాలంటీర్లను అదే పనిగా గుర్తుకు తెచ్చే విధంగానే ఈ మొత్తం ప్రక్రియ ఉందని అంటున్నారు. దాంతో విపక్ష కూటమి పెంచిన పెన్షన్ సంగతి దేముడెరుగు ఉన్న పెన్షన్ తెచ్చుకునే దారేదీ అని సామాజిక పెన్షన్ దారులు గగ్గోలు పెడుతున్నారు.

మొత్తం మీద చూస్తే కలెక్టర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. ఈ నేపధ్యంలో పెన్షన్ల పంపిణీ అన్నది అదనపు పనిగా ఉంది. ఇదే విపక్షానికి అధికార పక్షానికి మధ్య రాజకీయ సమర వేదిక గానూ ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News