పవర్ పోయి 10 రోజులు కాకున్నా.. అప్పుడే ఇంతలా కోతలా!

ఫలితాలు వెలువడి.. పవర్ పోయి పది రోజులు కాక ముందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన సొంత మీడియా సంస్థలో చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారాయి.

Update: 2023-12-13 05:44 GMT

కొన్ని పరిణామాల గురించి తెలిసినంతనే అయ్యో అనిపిస్తుంది. అలాంటి ఉదంతమే దీన్ని చెప్పాలి. విలువల గురించి.. సిద్ధాంతాల గురించి చెప్పే మాటలకు.. చేసే చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న దానికి నిదర్శనంగా తాజా పరిణామాల్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలు కావటం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇవన్ని తెలిసిన విషయాలే కదా? అనుకోవచ్చు. ఆగండి.. అక్కడికే వస్తున్నాం. ఫలితాలు వెలువడి.. పవర్ పోయి పది రోజులు కాక ముందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన సొంత మీడియా సంస్థలో చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారాయి.

అధికారం చేజారిన నేపథ్యంలో ఇప్పటివరకు నడుస్తున్నకేసీఆర్ కి సంబందించిన దినపత్రికకు సంబంధించి ఖర్చుల్లో కోత పెట్టేందుకు వీలుగా పరిణామాలు వేగంగా సాగుతున్నాయి అని ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే పేజీల సంఖ్యలో తేడా వచ్చేయటం తెలిసిందే. అంతేకాదు.. సిబ్బంది కోతకు రంగం సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన సమావేశం ఇప్పటికే పూర్తి అయ్యిందని.. వేటు వేసేందుకు కత్తులు నూరుతున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు.. వివిధ జిల్లాల్లో ఉన్న యూనిట్లను తాత్కాలికంగా ఆపేసి.. వాటిని దగ్గర్లో ఉన్న వేరే యూనిట్లలో విలీనం చేస్తారని చెబుతున్నారు. ఈ మొత్తం పరిణామాలతో బాగా ప్రభావితం అయ్యేది జర్నలిస్టులేనని చెబుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి.. అధికారం చేజారి పది రోజులు కూడా కాకముందే వేట్లకు వేళాయె అన్నట్లుగా వ్యవహరించటం ఎంతవరకు సబబు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ వేటుకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ.. రానున్న కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్నివెల్లడిస్తారని చెబుతున్నారు.

పవర్ పోయిన పది రోజులకే ఇంతలా చేతులు ఏత్తేసే సంకేతాలు మంచివి కాదంటున్నారు. ఒకవేళ.. ఈ సమాచారంలో నిజం లేకపోతే..ఆ కాంపౌండ్ లో జోరుగా సాగుతున్న ఈ ప్రచారానికి యుద్ధ ప్రాతిపదికన చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. మొత్తంగా అయితే.. పవర్ పోయిన వేళ.. తమ ప్రాణం మీదకు వచ్చిందన్న మాట ఆ మీడియా సంస్థలో పని చేస్తున్న పలువురు వాపోతున్న వైనం అయ్యో అనిపించేలా ఉందంటున్నారు. ఈ తరహా నిర్ణయం కేసీఆర్ కు తెలిసి ఉండదని.. ఆయన అలాంటి వాటిని ఎంకరేజ్ చేయరంటున్నారు. ఇప్పటికైనా ఈ అంశం ఆసుపత్రిలో ఉన్న ఆయన వరకు వెళ్లాల్సిన ఉందన్న మాట బలంగా వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News