సెంటిమెంట్ అయిన కంచుకోటలో టీడీపీ పరిస్థితి?

అయితే.. ఈసారి కూటమి గెలుపుపై టీడీపీ ధీమాగానే ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లో రెబల్స్ టెన్షన్ పెడుతున్నారని తెలుస్తోంది.

Update: 2024-05-26 00:30 GMT

ఏమాటకామాట చెప్పుకోవాలంటే... ఈ సార్వత్రిక ఎన్నికలు కూటమికి.. అందునా ప్రధానంగా టీడీపీకి అత్యంత కీలకం అని అంటున్నారు పరిశీలకులు. ఈసారి ఎన్నికల ఫలితాలు కాస్త అటూ ఇటూ అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. అయితే.. ఈసారి కూటమి గెలుపుపై టీడీపీ ధీమాగానే ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లో రెబల్స్ టెన్షన్ పెడుతున్నారని తెలుస్తోంది.

ఆవును... ఈసారి గెలిచి నిలవడం టీడీపీకి అత్యంత కీలకమైన విషయం అని అంటున్నారు పరిశీలకులు. ఆ విషయం అందరికంటే ఆ పార్టీ అధినేతకే ఎక్కువగా తెలియడంతోనో ఏమో కానీ... బీజేపీ, జనసేనతో జత కట్టి చివరి నిమిషం వరకు పోరాడింది. ఇదే సమయంలో పోలింగ్ శాతం కూడా భారీగా పెరగటంతో అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటని చాలా ఆశలు పెట్టుకుంది.

మరోవైపు గెలుపుపై పూర్తి ధీమాను వ్యక్తపరిచారు జగన్. ఇందులో భాగంగా... 2019 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసారు. దీంతో జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం కన్ ఫాం అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో... టీడీపీ గెలుపు ఖాయమని భావించిన సెగ్మెంట్లలో రెబల్స్ దెబ్బ తీస్తున్నట్లు కథనాలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... విజయనగరం అసెంబ్లీ సీటుపై టీడీపీ చాలా ఆశలు పెట్టుకుందని అంటున్నారు. పైగా ఈ స్థానంలో గెలుపును పలువురు సెంటిమెంట్ గా కూడా భావిస్తున్నారని చెబుతున్నారు. ఇదే క్రమంలో... స్థానికంగా సమీకరణాలు కూడా తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే... టీడీపీ, వైసీపీ అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటే టీడీపీకి కాస్త అనుకూల ఫలితాలు వచ్చేవి కానీ... మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతో సమస్య వచ్చిందని అంటున్నారు.

ఇక్కడ నుంచి టీడీపీ, వైసీపీ అభ్యర్థులతో పాటు 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మీసాల గీత ఇండిపెండెంట్ గా పోటీ చేయడంతో... ఈ ఎఫెక్ట్ టీడీపీపైనే ఎక్కువగా పడే అవకాశం ఉంది.. కూటమి ఓట్లనే ఆమె భారీగా చీల్చే అవకాశం ఉంది అని అంటున్నారు. కాగా... ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్ర స్వామి పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో... మీసాల గీతకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ టీడీపీ పైనే పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. అలా కాకుండా ఆమె పెద్దగా ప్రభావం చూపకపోతే మాత్రం అది కచ్చితంగా టీడీపీకే ప్లస్ అని చెబుతున్నారు. మరి త్రిముఖ పోటీగా మారిన విజయనగరంలో సైకిల్ జెండా ఎగురుతుందా.. లేక గీత ఎఫెక్ట్ తో సైకిల్ పంక్చర్ అవుతుందా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News