62వేల మంది వాలంటీర్లు రాజీనామా... ఇక వారంతా ప్రైవేటు వ్యక్తులే!
ఏపీలో గ్రామ/వార్డు వాలంటీర్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
ఏపీలో గ్రామ/వార్డు వాలంటీర్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. పైగా గతకొన్ని రోజులుగా గ్రామ/వార్డు వాలంటీర్లపై విపక్ష నేతలు.. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చేసిన అత్యంత ఘోరమైన వ్యాఖ్యల నేపథ్యంలో... వీరికి అటు ప్రభుత్వం నుంచి, ఇటు ప్రజల నుంచీ, ప్రధానంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి మద్దతు భారీగా దొరికింది.
ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం.. వాలంటీర్లు అంటే జగన్ సైన్యం అని చెబుతూ.. వీరిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు వెళ్లడం, దీంతో వీరిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టడంతోపాటు... ఎన్నికలు పూర్తయ్యే వరకూ వీరి ద్వారా ప్రజలకు ఇంటివద్దకు చేరుతున్న ప్రభుత్వ పథకాల పనులకు కూడా దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి! దీంతో... ఏప్రిల్ నెలలో పించన్ దారులు పడిన ఇబ్బందుల గురించి తెలిసిందే.
ఈ నేపథ్యంలో... తమపై నిన్నటి వరకూ మానసికంగా ఎంతో ఇబ్బందులు పెట్టిన వారు, ఈ రోజు జాబ్ శాటిస్ఫేక్షన్ కు కూడా దూరం పెట్టడంలో కీలక పాత్ర పోషించారంటూ పలువురు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేయడం.. ప్రజలకు సేవ చేయాలనే విధుల్లో చేరితే, ఆ విధులకు దూరం పెట్టారని మరికొంతమంది వాలంటీర్లు ఆవేదన చేందుతూ వారి వారి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.. రాజీనామాలు సమర్పించారు.
అయినప్పటికీ... వాలంటీర్లను కొంతమంది వెంటాడారు! ఇందులో భాగంగా... రాజీనామాలు చేసినా కూడా వారిని ఎన్నికల్లో ఏజెంట్లు గా కానీ, మరెటువంటి విషయాల్లోనూ ఎంటర్ చేయకూడదని ఒకరు అంటే... వారి రాజీనామాల్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. వీరంతా రాజీనామాలు చేసి, తిరిగి వైసీపీకి పనిచేస్తారని చెప్పుకొచ్చారు!
దీంతో ఎన్నికల కమిషన్ తరుపు న్యాయవాది అవినాశ్ ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఇప్పటివరకూ ఏపీలో 62,571 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారని వెల్లడించారు. ఇదే సమయంలో... ఆ రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇకపై వారిని ప్రైవేటు వ్యక్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. దీంతో... ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
ఈ సమయంలో... ఎన్నికలు ముగిసేవరకూ వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించవద్దని, ఆమోదిస్తే వారు వైసీపీకి పనిచేస్తారని పిటిషన్ దాఖలు చేసిన వారి వాదనలో పాటు... ఆ రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వలేమని, ఇకపై వారిని ప్రైవేటు వ్యక్తులుగానే పరిగణిస్తామంటూ ఎన్నికల కమిషన్ తరుపు న్యాయవాది వాదనలూ విన్న కోర్టు విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.