తాజా అధ్యయనం: పోలింగ్ అదరగొట్టిన టాప్25 స్థానాలు ఇవే

ఇప్పటికి పూర్తైన ఐదు దశలను చూస్తే.. ప్రతి దశలోనూ ఒక కొత్త పరిణామాన్ని చూడొచ్చు.

Update: 2024-05-27 04:17 GMT

నిజమే.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ముగిసిన ఐదో దశను కలిపితే మరో రెండు దశల్లో పోలింగ్ పెండింగ్ లో ఉంది. ఇప్పటికి పూర్తైన ఐదు దశలను చూస్తే.. ప్రతి దశలోనూ ఒక కొత్త పరిణామాన్ని చూడొచ్చు. ఇదిలా ఉంటే.. మొదటి నాలుగు దశల్లో జరిగిన పోలింగ్ మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

కీలకమైన నాలుగో దశ ముగిసిన మే 13 వరకు జరిగిన పోలింగ్ లో ఏ లోక్ సభా నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి? అన్న అంశంపై అధ్యయనం చేపట్టారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే 2019లోక్ సబా ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా భారీగా పోలింగ్ సాగటం విశేషం. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. మే 13 వరకు జరిగిన పోలింగ్ లో భారీగా పోలింగ్ నమోదైన స్థానంలో అసోంలోని ధుబ్రీఎంపీ స్థానం మొదటి స్థానం నిలిస్తే.. మూడో స్థానంలో తెలంగాణలోని చేవెళ్ల స్థానం నిలవటం ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు.. దేశ వ్యాప్తంగా భారీగా పోలింగ్ సాగిన టాప్ 25 ఎంపీ స్థానాల్లో తొమ్మిది స్థానాలు తెలంగాణలో ఉండటం దేనికి సంకేతం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణలో చేవెళ్లతో పాటు మల్కాజిగిరి.. హైదరాబాద్.. మహబూబ్ నగర్.. భువనగిరి.. మెదక్.. నాగర్ కర్నూల్.. జహీరాబాద్.. వరంగల్ లో పోలైన ఓట్లు ఎక్కువగా ఉన్నట్లుగా ఎస్ బీఐ అధ్యయనం స్పష్టం చేసింది.

ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓట్లు నమోదు కావటం.. పోలైన ఓట్లు ఎక్కువ కావటం మామూలే అయినా.. దేశ వ్యాప్తంగా జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో టాప్ 25 పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో తొమ్మిది తెలంగాణలో ఉండటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. ఈ పెరిగిన ఓట్లు ఎవరికి మేలు చేయనున్నాయి? ఎవరికి చేటు చేస్తాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజా అధ్యయనంలో మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. పోలింగ్ భారీగా సాగిన నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు ఎక్కువగా పెరిగాయన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. మహిళల ఓట్లు రాజకీయ పార్టీల తలరాతల్ని మారుస్తాయని మాత్రం చెప్పక తప్పదు.

ఎస్ బీఐ అధ్యయనం చెప్పిన ఆసక్తికర అంశాల్నిచూస్తే..

- నాలుగు దశల్లో కలిపి 2019లో 21.95 కోట్ల పురుషులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు నిరూపించుకోగా.. 2024లో ఈ సంఖ్య 22.80 కోట్లు.

- 2019లో మహిళా ఓటర్లు ఓటేసిన వారు 20.59 కోట్లు కాగా.. ఈసారి 21.53 కోట్ల మంది మహిళలు ఓటేశారు.

- ఓటేసిన పురుష ఓటర్లు వర్సెస్ మహిళా ఓటర్లను చూస్తే.. 2019లో 85 లక్షల మంది పురుషులు ఓటేస్తే.. ఈసారి ఎన్నికల్లో ఓటేసిన మహిళల సంఖ్య ఏకంగా 94 లక్షలకు పెరగటం గమనార్హం.

- 2019లో తొలి నాలుగు దశల్లో జరిగిన పోలింగ్ తో పోలిస్తే.. 2024లో పోలింగ్ శాతం తగ్గింది.

- 2019 తొలి నాలుగు దశల్లో పోలింగ్ శాతం 68.15 శాతం కాగా.. 2024లో 66.95 శాతం మాత్రమే. 2019తో పోలిస్తే 2024లో ఓటర్లు పెరగటంతో ఓట్లు వేసిన శాతం పెరిగిందని చెప్పాలి.

- 2019తో పోలిస్తే 2024లో పెరిగిన ఓటర్ల లెక్కలో కర్ణాటకలో 35.5లక్షలు.. తెలంగాణలో 31.9 లక్షలు.. మహారాష్ట్రలో 20 లక్షలు ఎక్కువగా పోల్ అయ్యాయి. ఓటర్లు తగ్గిన రాష్ట్రాల్లో కేరళ.. మణిపూర్ లు నిలిచాయి.

Tags:    

Similar News