పదవుల పంపకంలో జనసేనకు మరో చాన్స్.. రీజనేంటి?
అయితే.. టీడీపీ తరఫున ఎంతో మంది నాయకులు ఎదురు చూస్తున్నా.. చంద్రబాబు మాత్రం ఒకటి మాత్రమే తాను తీసుకుని మరొకటి జనసేనకు కేటాయించారు.
ఏపీలో కూటమి సర్కారును ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన జనసేన పార్టీ అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు.. టీడీపీ అధినేత.. కూటమి సారథి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం తగ్గకుండా ప్రాధాన్యం కల్పిస్తున్నారు. కేవలం గౌరవంలోనే కాకుండా.. పదవుల పంపకంలోనూ తన పార్టీ ప్రాధాన్యాలను కూడా పక్కన పెట్టి పవన్‌కు ఎక్కువగా చోటు కల్పిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతోపాటు.. మరో ఇద్దరు కీలక నేతలకు మంచి శాఖలతో కూడిన మంత్రి పదవులు అప్పగించారు.
ఇటీవల శాసన మండలిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే.. టీడీపీ తరఫున ఎంతో మంది నాయకులు ఎదురు చూస్తున్నా.. చంద్రబాబు మాత్రం ఒకటి మాత్రమే తాను తీసుకుని మరొకటి జనసేనకు కేటాయించారు. నిజానికి రెండూ ఈ సారికి టీడీపీనే తీసుకుందామని చాలా మంది కీలక నాయకులు చంద్రబాబుకు ప్రతిపాదించారు. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారని.. వారిని సంతృప్తి పరచాలని కూడా సూచించారు. కానీ, చంద్రబాబు మాత్రం పవన్‌కు ప్రాధాన్యం ఇస్తూ.. రెండు పదవుల్లో ఒకటి ఆయనకే కేటాయించారు.
ఇక, ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్(ఏఏజీ) పదవిని కూడా జనసేన పార్టీకి కేటాయించారు. ఇటీవల అడ్వకేట్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌కు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఈయన తర్వాత.. రెండో కీలక స్థానమైన ఏఏజీ పదవిని మాత్రం జనసేనకు ఇచ్చేశారు. జనసేన పార్టీ లీగల్ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఇవన సాంబశివ ప్రతాప్ ను ఏఏజీగా నియమిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ గా పదేళ్లుగా ఆయన సేవలు అందిస్తున్నారు. హైకోర్టులో సుదీర్ఘ ప్రాక్టీసు అనుభవం గడించారు.
కాగా, చంద్రబాబుతీసుకున్న ఈ నిర్ణయంపై కూటమి పార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే..దీనివెనుక వ్యూహం ఏంటనేది కూడా చర్చకు వస్తోంది. కూటమి పార్టీలను ముందుకు నడిపించడంలోనూ.. జగన్ సర్కారును ఓడించడంలోనూ కీలక భూమిక పోషించిన పవన్‌ను సంతృప్తి పరిచే కంటే కూడా.. జనసేన కార్యకర్తలను సంతృప్తి పరచడం ద్వారా కూటమిలో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలను చంద్రబాబు పంపిస్తున్నారని తెలుస్తోంది. మున్ముందు.. ఈ పరిణామం తమకు లాభం చేకూరుస్తుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.