టీడీపీ తొలి జాబితా.. 'కమ్మ' లకే అత్యధిక సీట్లు!
ఒకేసారి 94 మంది అభ్యర్థులను ప్రకటించి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ చరిత్రలోనే తొలిసారి ఇంతమంది అభ్యర్థులను.. అది కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడకముందే ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒకేసారి 94 మంది అభ్యర్థులను ప్రకటించి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారని అంటున్నారు.
కాగా చంద్రబాబు ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో అత్యధిక సీట్లు కమ్మ సామాజికవర్గానికి లభించాయి. కమ్మలకు 21 సీట్లు లభించగా, ఆ తర్వాత స్థానంలో రెడ్లు అత్యధిక సంఖ్యలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కమ్మల తర్వాత రెడ్లకు 17 సీట్లు లభించాయి. జనసేన పార్టీతో కూడా కలుపుకుంటే కమ్మలకు మొత్తం 22 సీట్లు దక్కాయి.
కాగా టీడీపీ తరఫున ఒకేసారి 20 మంది ఎస్సీలకు సీట్లను ప్రకటించారు. 19 మంది బీసీలకు సీట్లు లభించాయి. టీడీపీ నుంచి కాపు, తూర్పు కాపులకు 9 సీట్లు లభించాయి. అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన కూటమి కసరత్తు చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు.
క్షత్రియుల నుంచి నలుగురు, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) నుంచి ముగ్గురు, వైశ్యుల నుంచి ఇద్దరు, వెలమ, ముస్లింల నుంచి ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 99 స్థానాలకు టీడీపీ–జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం టీడీపీ 24 అసెంబ్లీ స్థానాలను జనసేనకు వదిలేసింది. అలాగే మరో మూడు పార్లమెంటు సీట్లను జనసేన పార్టీకి కేటాయించింది.
బీజేపీతో పొత్తు ఖరారయ్యాక మరో 57 సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. బీజేపీకి 4 అసెంబ్లీ, 4 పార్లమెంటు సీట్లను కేటాయిస్తారని చెబుతున్నారు. అవి కూడా గెలిచే సీట్లను ఇస్తారని అంటున్నారు. బలం లేకుండా ఎక్కువ సీట్లు ఇస్తే అది అంతిమంగా వైసీపీకే లబ్ధి చేకూరుతుందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. జనసేన తక్కువ సీట్లు తీసుకోవడానికి కూడా కారణం ఇదేనంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో ఒక బీసీ.. కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), ఒక బ్రాహ్మణ.. లోకం మాధవి (నెల్లిమర్ల), ఒక కమ్మ నాదెండ్ల మనోహర్ (తెనాలి), ఇద్దరు కాపులు.. బత్తుల బలరామకృష్ణ (రాజానగరం), పంతం నానాజీ (కాకినాడ రూరల్) ఉన్నారు.