ఇదేంది పెద్దిరెడ్డి? సైకిల్ యాత్ర చేసే తమ్ముడి చొక్కా విప్పించటమా?
పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి.
ఎంత రాజకీయం అయితే మాత్రం మరీ ఇంతలా గీత దాటేయటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్య భారతంలో అందరూ ఆమోదించే రీతిలో రాజకీయాల్ని నడపాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరించే ధోరణి ప్రజల్లో చిరాకును తెప్పించటమే కాదు.. ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఆ కోవలోకే వస్తోంది. స్కిల్ స్కాం ఆరోపణలతో జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త విషయంలో పెద్దిరెడ్డి అభిమానులు చెలరేగిన వైనం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఈ తరహా రాజకీయం ఏపీకి ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంకు చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు కుప్పానికి సైకిల్ యాత్రను చేపట్టారు తెలుగుదేశం పార్టీకి చెందిన అతను (శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామక్రిష్ణ.. రామసూరి.. ఆదినారాయణ.. సుందరరావు.. రమేశ్) పసుపుచొక్కా ధరించి.. సైకిల్ కు పార్టీ జెండా కట్టి.. మెడలో కండువా వేసుకొని కొన్ని రోజులుగా సైకిల్ యాత్రను చేస్తున్నారు. అక్టోబరు 2న రణస్థలం నుంచి కుప్పానికి సైకిల్ యాత్రగా బయలుదేరారు.
తన యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వేళలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ టీ తాగేందుకు సైకిళ్లు ఆపారు. వీరి గురించి తెలుసుకున్న వైసీపీకి చెందిన కార్యకర్తలు కొందరు అక్కడకు వచ్చి వారిని తిట్టటం మొదలు పెట్టారు. ‘‘ఇది పెద్దిరెడ్డి అడ్డా. పుంగనూరులో అడుగు పెట్టి వెనక్కి వెళ్లగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. అలాంటిది తెలుగుదేశం జెండాలతో మీరెలా వస్తార్రా?’’ అంటూ దూషించటంతో పాటు.. వారి పుసుపు చొక్కాల్ని విప్పించి.. సైకిళ్లకు కట్టిన పార్టీ జెండాల్ని తీయించి.. ఊరు దాటించారు.
ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమని.. ఇక్కడ టీడీపీ జెండా ఎగరకూడదన్న వారు.. ‘‘మిమ్మల్ని కొట్టకుండా పంపిస్తున్నాం. సంతోషించండి. శ్రీకాకుళం నుంచి ఏం పీకటానికి వచ్చారు?’ అంటూ వ్యాఖ్యానించిన వైనం షాకింగ్ గా మారింది. ఇలాంటి అత్యుత్సాహపు ఘటనలు తాము అభిమానించే పెద్దిరెడ్డికి నష్టం కలిగేలా చేస్తాయన్న విషయం వారు పట్టించుకోకపోవటం గమనార్హం. మరి.. తన పేరు మీద జరిగిన ఈ తరహా ఘటనపై పెద్దిరెడ్డి రియాక్టు అవుతారా? మౌనంగా ఉంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.