చచ్చిపోయారా.. చంపేశారా? పుతిన్ ప్రత్యర్థి మరణంపై ప్రపంచం దిగ్భ్రాంతి
దీనికి గల కారణాలు పైకి చెబుతున్నవాటి కంటే కూడా.. అంతర్గత కారణాలు వేరేగా ఉండి ఉంటాయనే సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్నాయి.
అధికారం కోసం ఏమైనా చేసే నాయకుడిగా పేరున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలనలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. నిత్యం పుతిన్‌ను విమర్శించి.. ఆయన పాలనను ఎండగట్టే.. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ మృతి చెందారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేతగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే.. శుక్రవారం ఆకస్మికంగా ఆయన మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీనికి గల కారణాలు పైకి చెబుతున్నవాటి కంటే కూడా.. అంతర్గత కారణాలు వేరేగా ఉండి ఉంటాయనే సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్నాయి.
అధికారుల వివరణ ఇదీ..
గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ``నావల్నీ శుక్రవారం వాకింగ్ చేసిన తరువాత అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది సమయానికే స్పృహ కోల్పోయిన నావల్నీకి వెంటనే వైద్య సేవలు అందించినా ఫలితం లేకపోయింది. నావల్నీ చనిపోయారని వైద్యులు నిర్ధారించారు`` అని అధికారులు తెలిపారు.
ప్రపంచ అనుమానం ఇదీ..
పుతిన్ ప్రత్యర్థి మరణంపై అనేక అనుమానాలు ముసురుకున్నాయి. త్వరలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పుతిన్ కు దీటుగా నిలిచే నాయకుడిగా నావల్నీ పేరే వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన అనుచరులు కూడా ప్రచారం ప్రారంభించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నావల్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుద్ధోన్మాదం సరికాదని.. అభివృద్ది ముఖ్యమని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఖైదీగా జైలుశిక్ష అనుభవిస్తున్న నావల్నీ.. కొన్ని నెలల కిందట జైలు నుంచి అదృశ్యమయ్యారని ప్రచారం జరిగింది. కొన్ని రోజులకు ఆయన ఆచూకీ లభించిందని నావల్నీ తరఫు న్యాయవాదులు, ప్రతినిధులు చెప్పారు. కానీ అప్పటినుంచే నావల్నీ అనారోగ్యానికి గురయ్యారని వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నావల్నీ మృతిచెందడం రాజకీయంగా కలకలం రేపుతోంది.