ఏపీలో కూటమి గెలుపు... ఆసక్తికరంగా ఈ సంస్థల ఫలితాలు!
సంక్రాంతి పండక్కి వెళ్లిన స్థాయిలో అన్నట్లుగా పోలింగ్ కోసం పట్టణాల నుంచి పల్లెలకు కదిలారు.
ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆరోజు రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. వర్షం పడుతుంటే గొడుగులు పట్టుకుని, అర్ధరాత్రి అయినా కూడా ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఓపికగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంక్రాంతి పండక్కి వెళ్లిన స్థాయిలో అన్నట్లుగా పోలింగ్ కోసం పట్టణాల నుంచి పల్లెలకు కదిలారు.
ఇలా జనం పోటా పోటీగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో పలు విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... ఓటర్లు ఈ స్థాయిలో చైతన్యం తెచ్చుకుని పోలింగ్ బూత్ లకు వెళ్లారంటే.. ఇంత కసిగా అన్నట్లుగా ఓటు వేశారంటే.. అది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమే అనే విశ్లేషణలు బలంగా వినిపించాయి.
సాదరణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పీక్స్ కి చేరిన సందర్భాల్లోనే ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఈ స్థాయి చైతన్యం వస్తుందని.. తమ ఆగ్రహాన్ని ఓటుతో చూపించాలని భావిస్తారని పలువురు విశ్లేషించారు. అందుకు కొన్ని ఉదాహరణలు తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో.. తాజాగా వెలువడిన పలు సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అదే విషయాన్ని బలపరుస్తున్నాట్లుగా ఉన్నాయి!
అవును... ఏపీలో తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు... ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందనే విషయానికి బలం చేకూరుస్తున్నట్లుగ ఉన్నాయి. ఇదే క్రమంలో... ఏపీలో కూటమి గెలుపును అవి తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ధృవీకరిస్తున్నాయనే చెప్పాలి! ఇందులో భాగంగా ప్రధానంగా పలు కీలక సంస్థలు తమ ఫలితాల్లో కూటమి గెలుపును కన్ ఫాం చేశాయి.
ఇందులో భాగంగా... ప్రధానంగా కేకే సంస్థ.. కూటమికి 161 అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే క్రమంలో... పయనీర్ (144), పీపుల్స్ పల్స్ (111 - 135), చాణక్య స్ట్రాటజీస్ (114 - 125), రైజ్ (113 - 122), జనగళం (104 - 118), స్మార్ట్ పోల్ (93 +/-8), పీటీఎస్ గ్రూప్ (128 - 131) మొదలైన సంస్థలు ఏపీలో కూటమిని గెలుపును కన్ ఫాం చేశాయి.
ఇదే క్రమంలో లోక్ సభ స్థానాల విషయంలోనూ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా... ఇండియా టీవీ (19 - 21), రైజ్ (17 - 20), చాణక్య స్ట్రాటజీస్ (17 - 18), పయనీర్ (20), పీపుల్స్ పల్స్ (17 - 19), కేకే సర్వే (25), ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ (18), ఏబీపీ - సీ ఓటర్ (21 - 25), న్యూస్ 18 (19 - 22), సీఎనెక్స్ (19 - 21) మొదలైన సంస్థలు లోక్ సభ స్థానాల్లో కూటమి పెర్ఫార్మెన్స్ ని అంచనా వేశాయి!
ఈ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను గమనిస్తే... ఏపీలో 2014 తరహాలో కూటమి మరోసారి అధికారంలోకి రాబోతుందనే విషయం స్పష్టమవుతుందనే భావించాలి. కాగా... జూన్ 4న ఎగ్జాట్ ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలతో అవి మ్యాచ్ అయితే... ఏపీలో ప్రభుత్వ మార్పు తథ్యం!!