ఆ భూములు కబ్జా చేయలేదు: మల్లారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నేతలపై ఈ తరహా ఆరోపణలు రావడంతో అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టాక్ వచ్చింది.
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నేతలపై ఈ తరహా ఆరోపణలు రావడంతో అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై మల్లారెడ్డి స్వయంగా స్పందించారు. ఇది, ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదని మల్లారెడ్డి క్లారిటీనిచ్చారు.
భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జా ఆరోపణలను మల్లారెడ్డి ఖండించారు. ఆ ఆరోణలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఆ కేసుపై తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై షామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసు, ఎఫ్ఐఆర్ నమోదైంది.
మల్లారెడ్డితోపాటు ఆయన అనుచరులు 9మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. కేశవాపురం గ్రామంలో 47 ఎకరాలను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఫిర్యాదు అందింది. ఎన్నికలకు ముందు రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, కేశవాపురం తహశీల్దార్ తో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. సర్వేనెంబర్ 33, 34, 35లో 47 ఎకరాల 18 గుటల లంబాడీల వారసత్వ భూమిని మల్లారెడ్డి, ఆయన అనుచరులు 9 మంది కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు సెక్షన్ 420 చీటింగ్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.