టికెట్ ఎఫెక్ట్: ఒక చోట ఏడుపులు.. మరో చోట దీక్షలు.. ఇంకోచోట ఆసుపత్రి పాలు!
కంటతడి: తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీరు మున్నీరయ్యారు.
ఎన్నికల వేళ పార్టీల నుంచి టికెట్ ఆశించిన నేతలు అవి దక్కకపోవడంతో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరు మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. మరొకరు నడిరోడ్డుపై నిరాహార దీక్ష చేశారు. ఇంకొకరు.. మానసిక వేదనతో తీవ్రంగా హర్టయి.. షుగర్ లెవిల్స్ పడిపోయి.. బీపీ పెరిగిపోయి ఏకంగా ఆసుపత్రిలో చేరారు. ఇదీ.. రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకున్న కీలకపరిణామాలు. వీరంతా పొత్తు పార్టీలకు చెందిన వారే కావడం గమనార్హం.
కంటతడి: తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీరు మున్నీరయ్యారు. అధిష్టానం దీనిపై పునరాలోచించాలని కోరారు. ఈ స్థానాన్ని జనసేన తరఫున ఆరణి శ్రీనివాసులుకు కేటాయించారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు.. ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. టిక్కెట్ ను సుగుణమ్మకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పని చేశామని.. ఇప్పుడు తిరుపతి టికెట్ దక్కకపోవడం బాధాకరమని సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
'చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయి.?. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. పార్టీ కేడర్ అంగీకరించడం లేదు. టీడీపీ, జనసేన అధ్యక్షులు తిరుపతి అసెంబ్లీ స్థానంపై పునరాలోచించాలి. అధికార వైసీపీతో అనునిత్యం పోరాటం చేశాం. కానీ, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారికే టికెట్ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదు. నాకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి అసెంబ్లీ స్థానంపై పునరాలోచిస్తారని నమ్ముతున్నా.' అని సుగుణమ్మ పేర్కొన్నారు.
నిరాహార దీక్ష: విజయవాడ వెస్ట్ సీటును ఆశించిన జనసేన నాయకుడు పోతిన మహేష్.. నిన్న మొన్నటి వరకు నాలుగు రోజులుగా తన నిరసన స్వరాన్ని వినిపించారు. అయినా.. పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో సోమవారం ఏకంగా.. గాంధీ బొమ్మ సెంటర్‌లో నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే, పోలీసులు ఆయనకు పర్మిషన్ లేదని చెప్పడంతో తన మకాంను ఇంటికి మార్చుకుని.. అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు. తనకే వెస్ట్ సీటు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.
ఆసుపత్రి పాలు: టీడీపీ సీనియర్ నాయకుడు, విశాఖపట్నానికి చెందిన బండారు సత్యనారాయణ మూర్తి పెందుర్తి లేదా అనకా పల్లి అసెంబ్లీ సీట్లను ఆశించారు. కానీ, ఆయన అభ్యర్థనలు బుట్టదాఖలయ్యాయి. పైగా.. ఈ రెండు సీట్లను అధినేత వేరే వారికి ఇచ్చేశారు. దీంతో మానసికంగా కుంగిపోయిన బండారు రెండు రోజులుగా అన్నం తినలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో షుగర్ లెవిల్స్ పడిపోయి.. బీపీ పెరిగిపోయి.. అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఇదీ.. టికెట్ల ఎఫెక్ట్. మరి ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.