ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన డెమొక్రటిక్ అభ్యర్థి ఫ్యామిలీ

ప్రపంచ అగ్రదేశం అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.

Update: 2024-09-06 06:13 GMT

రాజకీయాల్లో కప్పదాట్లు చూస్తూ ఉంటాం. అంటే ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లడం ఎన్నో జరిగాయి. ఒకవేళ అపోజిషన్ పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటే ఏదో చాటుమాటుగా సపోర్టు చేస్తుంటారు మన నాయకులు. కానీ.. అమెరికా రాజకీయాల్లో మాత్రం సంచలనం చోటుచేసుకుంది.

ప్రపంచ అగ్రదేశం అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా యుద్ధం సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బరిలో నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రెసిడెంట్‌గా బరిలోకి దిగారు. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొన్నట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఇంత ఆసక్తికరంగా ఎన్నికల పోటీ కొనసాగుతుంటే.. అమెరికా డెమొక్రాటిక్ ఉపాధ్యక్షుడిగా బరిలో నిలిచిన వాల్జ్ కుటుంబం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు పలికారు. ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆయన కుటుంబం చొక్కాలు ధరించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నెబ్రాస్కా వాల్జ్స్ ఫర్ ట్రంప్’ అనే నినాదంతో ఉన్న టీ షర్టులు ధరించి ఫొటో X వేదికగా పంచుకున్నారు.

రిజిస్టర్డ్ రిపబ్లికన్ అయిన టిమ్ సోదరుడు జెఫ్ చేసిన వరుస ఫేస్‌బుక్ పోస్టుల తర్వాత వాల్జ్ కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత వారంలో వాల్జ్ సోదరుడు జెఫ్ కమలా హారిస్‌ తన వైస్ ప్రెసిడెంట్ ఎంపికపై కామెంట్లు చేశారు. ఎనిమిదేళ్లుగా అతను తనతో మాట్లాడడం లేదని చెప్పుకొచ్చాడు. అలాగే హారిస్ విధానాలను సైతం వ్యతిరేకించాడు. జెఫ్ వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అతని కుటుంబం ట్రంప్‌కు మద్దతు తెలుపుతూ టీ షర్టులు ధరించిన ఫొటో X లో వైరల్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఫొటోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్రొఫైల్‌లో కూడా పోస్ట్ చేశారు. అందులో ఉన్న వ్యక్తులు వాల్జ్‌కి తాత సోదరుడు అయిన అతని ముత్తాత ద్వారా సంబంధం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News