ఏపీలో జగన్ ప్రభంజనమేనా? టైమ్స్ నౌ సర్వే ఏం చెప్పింది?
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. గెలుపు ధీమా అధికార.. విపక్షాలు ప్రదర్శిస్తున్న వేళ.. ఎన్నికల్లో విజయం కోసం రెండు పార్టీలు ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న వేళ.. పోటాపోటీగా మారిన ఈ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు సాధిస్తారు? ఏ పార్టీకి విజయవకాశాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తాజాగా జాతీయ మీడియా సంస్థ.. ఇంగ్లిష్ చానల్ అయిన టైమ్స్ నౌ తాజాగా తన సర్వే ఫలితాల్నివెల్లడించింది. ఈటీజీతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి.
దాదాపు నెల పాటు జరిపిన సర్వే అనంతరం తన సర్వే ఫలితాల్ని వెల్లడించింది. ఇందులో ఫ్యాన్ ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుందని వెల్లడైంది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో 21-22 స్థానాల్ని అధికార వైసీపీ సొంతం చేసుకుంటుందని పేర్కొంది. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగాఏర్పడి కలిసి పోటీ చేస్తున్న వేళ.. వీరి కాంబినేషన్ ఘోరంగా విఫలమవుతుందని పేర్కొంది. కూటమికి మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది.
హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచార వేళ.. టైమ్స్ నౌ వెల్లడించిన సర్వే ఫలితాలు అధికార పార్టీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. విపక్ష టీడీపీ అండ్ కో కు షాకింగ్ గా మారాయి. తామెంతగా ప్రయత్నిస్తున్నా ఇటీవల వెలువడుతున్న సర్వే ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఎలా సాధ్యమన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. తాజా సర్వే ఫలితాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయని మాత్రం చెప్పక తప్పదు. సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాలే ఎన్నికల్లో కీలక భూమికను పోషించటంతో పాటు.. భారీ విజయాన్ని సొంతం చేసేలా చేస్తాయన్న మాట వినిపిస్తోంది.