తిరుమలలో చిక్కిన చిరుత... ఇకపై పిల్లలకు ట్యాగ్ లు!
నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను మూడు రోజుల క్రితం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత బలితీసుకున్న సంగతి తెలిసిందే
నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను మూడు రోజుల క్రితం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా హడలెత్తించింది. ఆరెళ్ల చిన్నారిని చిరుత పట్టుకునిపోవడం తీవ్ర దిగ్ర్బాంతిని కలిగించింది. దీంతో టీటీడీ, అటవీశాఖ సంయుక్తంగా అలర్ట్ అయ్యాయి.
ఇందులో భాగంగా ఆ స్పాట్ తో పాటు మరికొన్ని చోట్ల బోను ఏర్పాటు చేశాయి. దీంతో రాత్రివేళ అదే ప్రాంతానికి వచ్చిన చిరుత.. ఈసారి బోనుకి చిక్కింది. అంతేకాకుండా ఆంక్షలు విధించడంతోపాటు సిబ్బందిని సైతం మోహరించింది. మూడు రోజుల తర్వాత బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత ఎట్టకేలకు చిక్కింది.
కాగా.. తిరుమలలో చిరుతల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల నడక మార్గాల్లో చిన్న పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా... మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు నడకదారుల్లో అనుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు నడకదారిలో పోలీసులను అప్రమత్తం చేసింది.
ఇదే సమయంలో ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి ట్యాగ్ లు సైతం వేస్తున్నారు. దీంతో పిల్లలు తప్పిపోయినా, అనుకోని ఘటనలు జరిగినా సులభంగా కనిపెట్టేందుకు ఈ ట్యాగ్ లు ఉపయోగపడతాయని టీటీడీ వెల్లడించింది. పిల్లలకు వేస్తున్న ట్యాగ్ పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీసుల టోల్ ఫ్రీ నంబర్ నమోదు చేస్తున్నారు.
ఇదే క్రమంలో... రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల తరువాత బైక్ లకు అనుమతి నిరాకరించినట్టు టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది. సాయంత్రం 6 గంటల నుండి 100 మందిని కలిపి గుంపులుగా ఏడోవ మైలు నుండి శ్రీ నృశింహ స్వామి వారి ఆలయం వరకు పంపనున్నారు. వీరికి ముందూ వెనుకా భద్రతా సిబ్బంది ఉంటారు.