నాడు గోరంట్ల మాధవ్.. నేడు అంజూ యాదవ్!?
ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల క్రితం మహిళా సీఐ అంజూ యాదవ్ పేరు మార్మోగిన సంగతి తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల క్రితం మహిళా సీఐ అంజూ యాదవ్ పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. శ్రీకాళహస్తిలో నిరసనకు దిగిన జనసేన నేత కొట్టే శ్రీనివాస్ పై అంజూ యాదవ్ దాడి చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతికి వచ్చి అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా పరమేశ్వరరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
మరోవైపు వైసీపీ అంజూ యాదవ్ కు మద్దతుగా నిలిచింది. ఆ పార్టీలోని యాదవ నేతలు.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీశ్ కుమార్, తదితరులు జనసేన పార్టీపై మండిపడ్డారు. అంజూ యాదవ్ తన విధులు నిర్వర్తించారని.. ఆమెను భయపెట్టేట్టు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఐ అంజూ యాదవ్ ను అసెంబ్లీ బరిలో వైసీపీ నిలుపుతోందనే చర్చ జోరుగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అంజూ యాదవ్ ను పవన్ కళ్యాణ్ పై పోటీకి దించాలనేది వైసీపీ వ్యూహమని అంటున్నారు.
గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ పై కాలు దువ్వి నాటి సీఐ గోరంట్ల మాధవ్ పాపులర్ అయ్యారు. తన తొడ కొట్టి జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ ను వైసీపీ అధినేత జగన్ హిందూపురం పార్లమెంటు ఎన్నికల బరిలో దించారు. వైసీపీ గాలిలో గోరంట్ల మాధవ్ సునాయాసంగా గెలుపొందారు. సీఐ స్థాయి నుంచి ఏకంగా ఎంపీ అయిపోయారు.
ఇప్పుడిక అంజూ యాదవ్ వంతు వచ్చింది. ఆమె సైతం తన ప్రవర్తనతో గోరంట్ల మాధవ్ లానే తీవ్ర వివాదాల్లో కూరుకుపోయారు. గతంలో ప్రజలతో ఆమె దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే తమ ప్రత్యర్థులపై విరుచుకుపడిన ఆమెకు రాజకీయంగా ప్రమోషన్ కల్పించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంజూ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పోటీకి సిద్ధంగా లేకపోవడం కూడా ఆమెకు కలసి వస్తుందని చెబుతున్నారు.