వైఎస్ కోసం చేసిన కసరత్తుతో సివిల్స్ కొట్టేయొచ్చు.. వైరల్ గా రేవంత్ వ్యాఖ్యలు

''రైతే రాజైతే..'' పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం జరిగింది.

Update: 2023-09-03 06:26 GMT

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లో ‘‘రైతే రాజైతే..’’ పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన దిగ్విజయ్ సింగ్ తో పాటు మరికొందరు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్ని దాటేసి.. కాంగ్రెస్ నేతలుగా కలిసి మెలిసి పాల్గొన్న కార్యక్రమంగా దీన్ని చెప్పాలి.

మీడియాలో ఈ ప్రోగ్రాంకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకున్నా.. ఈ ప్రోగ్రాం జరిగిన హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లినప్పుడు సందడి వాతావరణం నెలకొంది. వైఎస్ మీద అభిమానంతో పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. దీనికి కారణం.. వైఎస్ గొప్పతనాన్ని వివరించే క్రమంలో ఆయన.. తాను గతంలో వైఎస్ విధానాల్ని సుదీర్ఘంగా విమర్శించిన వైనాన్ని సమర్థించుకోవటం.. జస్టిఫికేషన్ ఇచ్చుకున్న తీరు ఆకట్టుకునేలా చేసింది.

తొలిసారి చట్టసభలో అడుగు పెట్టినప్పటికీ.. వైఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విపక్ష నేతగా యాభై నిమిషాల పాటు మాట్లడే అపురూపమైన అవకాశం తనకు దక్కిందని.. అందులో భాగంగా వైఎస్ విధానాల్ని తప్పుపట్టేందుకు తానెంత కసరత్తు చేశానో చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. ఇప్పుడు కాంగ్రెస్ రథసారధిగా ఉన్నప్పటికీ.. ఇబ్బంది లేని రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటం ఆసక్తికరమని చెప్పాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. చట్టసభల్లో తాను జూనియర్ గా ఉన్నప్పటికీ.. తాను వినిపించిన వాదనకు సభలో లేచి నిలబడి సమాధానం చెప్పిన వైనం.. అలాంటి స్ట్రేచర్ తాను చూడలేదన్నారు.

ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. 2004లో వైఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఒక సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో ఆయన ప్రభుత్వ విధానాల్ని తప్పు పట్టేందుకు తాను రాత్రంతా కూర్చొని ప్రిపేర్ అయిన తీరును గుర్తు తెచ్చుకున్నారు. ‘‘వైఎస్ విధానాల్లో లోపాల్ని ఎత్తి చూపేందుకు రాతంత్రా కూర్చొని పెద్ద ఎత్తున అధ్యయనం చేయాల్సి వచ్చేది. ఆ మాత్రం ప్రిపరేషన్ చదువుకునే రోజుల్లో ఉండుంటే ఐఏఎస్.. ఐపీఎస్ అయ్యుండేవాళ్లం’ అంటూ చెప్పిన రేవంత్ మాటలు అందరిని ఆకర్షించాయి.

Tags:    

Similar News