రేవంత్ గన్ మెన్లు విధులకు ఎందుకు హాజరుకాలేదు?

టీపీసీసీ రథసారధి..ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి భద్రతగా ఉండే గన్ మెన్లు గురువారం కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది.

Update: 2023-08-18 04:22 GMT

టీపీసీసీ రథసారధి.. మల్కాజిగిరి ఎంపీగా వ్యవహరిస్తున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి భద్రతగా ఉండే గన్ మెన్లు గురువారం కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కేటాయించిన నలుగురు గన్ మెన్లు బుధవారం రాత్రి నుంచి రావటం లేదు. కీలకమైన ఎన్నికల వేళ.. ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది? విపక్ష నేతగా ఉన్న ఆయనకు గన్ మెన్లు విధులకు ఎందుకు హాజరు కాలేదు? అన్నది ప్రశ్నలుగా మారాయి. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం రేవంత్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజా పరిణామాలకు కారణమన్న మాట వినిపిస్తోంది.

రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని పోలీసులు సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. అంతేకాదు.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఇదే సమయంలో కొందరు పోలీసులు రేవంత్ మీద కంప్లైంట్ చేయగా.. తెలంగాణ వ్యాప్తంగా ఆయనపై 20 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే. ఆయన వద్ద విధులు నిర్వర్తిస్తున్న 2 ప్లస్ 2 గన్ మెన్లు ఉన్నపళంగా బుధవారం రాత్రి నుంచి విధులకు హాజరుకావటం ఆపేశారని చెబుతున్నారు.

అయితే.. తనకు భద్రత తొలగించినట్లుగా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని రేవంత్ చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రేవంత్ భద్రతను 2 ప్లస్ 2ను వన్ ప్లస్ వన్ కు కుదించినట్లుగా చెబుతున్నారు. ఆ ఇద్దరు కూడా ఎందుకు.. మీరే తీసేసుకోడంటూ రేవంత్.. వారిని వెనక్కి పంపినట్లుగా చెబుతున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మాత్రం తాము రేవంత్ కు భద్రత తొలగించలేదని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. ఉన్నగన్ మెన్లు ఎందుకు రాలేదు? కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.

Tags:    

Similar News