కమ్మ ఓట్ల చుట్టూ టీ పాలిటిక్స్... బీయారెస్ కార్నర్ అవుతుందా...?

తెలంగాణా రాజకీయాల్లో కొత్తగా ఇపుడు కమ్మల ఓట్లు అన్న చర్చ సాగుతోంది. కమ్మ ఓటు అన్నది ఇప్పటిదాకా జరిగిన రెండు ఎన్నికల్లో ఎక్కడా బాహాటంగా కనిపించలేదు.

Update: 2023-09-28 03:15 GMT

తెలంగాణా రాజకీయాల్లో కొత్తగా ఇపుడు కమ్మల ఓట్లు అన్న చర్చ సాగుతోంది. కమ్మ ఓటు అన్నది ఇప్పటిదాకా జరిగిన రెండు ఎన్నికల్లో ఎక్కడా బాహాటంగా కనిపించలేదు. ఏపీ సెటిలర్ ఓట్లు అనే వాడుతూ వచ్చేవారు. ఇక 2014లో సెటిలర్ల ఓట్లు టీడీపీ ఎక్కువగా తీసుకుంటే 2018 నాటికి బీయారే మెజారిటీ లాగేసింది. ఈ డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో అయితే సెప్టెంబర్ 9 వరకూ కధ ఒక రకంగా ఉంది.

ఆ తరువాత కధ మరోలా ఉంది అని అంటున్నారు. అది సామాజిక అంశాలు ఓట్ల కధ అన్న మాట. మరి సెప్టెంబర్ 9న విశేషం ప్రత్యేకత ఏంటి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్. బాబు అరెస్ట్ కి నిరసనగా హైదరాబాద్ ఐటీ సర్కిల్స్ లో ని ఉద్యోగులు ఆందోళనలు చేశారు. వారంతా ర్యాలీలు తీశారు. ధర్నాలు కూడా చేశారు.

అయితే మొదటిసారి రోడ్డు మీదకు వచ్చినపుడు పెద్దగా పట్టించుకోని బీయారెస్ సర్కార్ ఆ తరువాత ఈ ర్యాలేంటి లొల్లి ఏంటి అని పోలీస్ కట్టడితో నిలుపు చేసింది. దాని కంటే ముందు బీయారెస్ అధినాయకత్వం బాబు అరెస్ట్ మీద ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. మొదట్లో అయితే కేటీయార్ అది ఏపీ లొల్లి, పక్క రాష్ట్రం అని కామెంట్స్ చేసి ఊరుకున్నారు.

ఇటీవల మాత్రం ఆయన కాస్తా వివరంగా విషయం చెప్పారు. ఏపీలో రెండు పార్టీల గొడవను తెలంగాణా మీద రుద్దితే ఎలా అంటూ మండిపడ్డారు. రాజమండ్రి, విజయవాడ, అమరావతిలలో ఎక్కడైనా సరే ఆందోళలను చేసుకోండి, పీస్ ఫుల్ గా ఉన్న హైదరాబాద్ మాత్రం వద్దే వద్దు అనేశారు. దీంతోనే ఇపుడు కాంగ్రెస్ కార్నర్ చేస్తోంది.

పీసీసీ చీఫ్ ని ఆ మధ్య మీడియా చంద్రబాబు అరెస్ట్ ని ఎలా చూస్తున్నారు అంటే అలాగే చూస్తున్నాను అని వింతైన జవాబు ఇచ్చారు. అదేమంటే అరెస్ట్ గానే చూస్తున్నాను అని పొడిగా చెప్పుకొచ్చారు. కానీ ఇపుడు ఆయన బయటకు వచ్చారు. దానికి కారణం కాంగ్రెస్ లోని పెద్ద నేతలు మధు యాష్కీ, వి హనుమంతరావు లాంటి వారితో పాటు ఇతర నేతలు కూడా బాబు అరెస్ట్ ని ఖండించారు. దాంతో రేవంత్ రెడ్డి ఓపెన్ అయ్యారు.

కమ్మ వారి ఓట్లు కావాలి కానీ వారి బాధలు పట్టవా అంటూ బీయారెస్ మీద కేటీయార్ మీద ఒక్క లెక్కన మండిపడ్డారు. బాబు అరెస్ట్ అంటే దేశ సమస్య అని కొత్త అర్ధం చెప్పారు. ఒక రాష్ట్రంలో సమస్య ఉంటే దేశంలో ఆందోళనలు మరో చోట జరగవా అని నిలదీశారు. హైదరాబాద్ ఈ రోజుకీ ఉమ్మడి రాజధాని, అక్కడ అందోళన ఐటీ ఉద్యోగులు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. మొత్తానికి బీయారెస్ కి కమ్మ ఓట్లు వద్దా అనడం ద్వారా కార్నర్ చేసి పారేశారు.

సాలిడ్ గా ఆ ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావు వంటి వారు కాంగ్రెస్ జెండా పట్టుకున్నారు. మరికొంత మంది నేతలు కూడా ఇటే చూస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కి ఎటూ రెడ్డి సామాజికవర్గం మద్దతు ఉంటుందని ప్రచారం సాగుతున్న వేళ కమ్మ ఓట్ల కోసం కూడా గేలం వేసినట్లుగా రేవంత్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

హైదరాబాద్ లోని 28 నియోజకవర్గాలలో సెటిలర్ల ప్రభావం ఉంది. అందులో కమ్మ వారి ఓట్లు కీలకంగా చాలా చోట్ల ఉన్నాయి. దాంతో రేవంత్ రెడ్డి తెలివిగానే బీయారెస్ కి దెబ్బ కొట్టారు అంటున్నారు. ఇంతకీ అన్నీ తెలిసిన కేటీయార్ ఎందుకు ఇలా కామెంట్స్ చేశారు అని బీయారెస్ లో చర్చ నడుస్తోంది. బాబు అరెస్ట్ తప్పు అని వ్యక్తిగతంగా ఖండించిన బీయారెస్ నేతలు కూడా కేటీయార్ వ్యాఖ్యల తరువాత కలవరపడుతున్నారని అంటున్నారు. కమ్మ ఓటు బ్యాంక్ తమకు టర్న్ అవకపోతే ఇబ్బందులే అని గులాబీ బ్యాచ్ లో చర్చ సాగుతోంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News