సారు పాలనలో వినిపించని గొంతులు రేవంత్ సర్కారులో బయటకు ఎలా?

అయితే.. ఈ తరహా విమర్శలకు సీఎం రేవంత్ బెదరటం లేదు సరికదా.. ఆ మాత్రం విమర్శలు లేకపోతే ఏం బాగుంటుంది? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

Update: 2024-05-30 05:15 GMT

తెలంగాణలో సిత్రమైన సీన్ కనిపిస్తోంది. గతంలో ఎన్ని తప్పులు జరుగుతున్నా.. ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకున్నా.. బహిరంగంగా మాట్లాడటానికి జంకే తీరుకు భిన్నంగా.. ఇప్పుడు ఓపెన్ గా మాటలు పేలుతున్న వారిని చూస్తున్నాం. కొన్ని తప్పుల మీద మీడియా ప్రతినిధులు కొందరు అరవీర భయంకర తెలంగాణవాదులకు ఫోన్ చేసి.. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇలాంటి వైఖరులు సరికాదు.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఖండించాలని కోరితే.. ‘ఇప్పుడు మాట్లాడలేం. మమ్మల్నివదిలేయండి’ అంటూ చెప్పేసిన వారు సైతం రేవంత్ సర్కారు హయాంలో మాత్రం గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? అన్న ప్రశ్న వేసుకుంటే.. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించే చోట.. విమర్శలు చేయటానికి.. మాట మాట్లాడే ధైర్యం ఉంటుందన్న సమాధానం రాక మానదు.

రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరింది గత ఏడాది చివర్లో.. ప్రభుత్వం ఏర్పాటులో ఉండే కొత్తదనం.. కుదురుకునేంతలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చేయటం.. ఆ వెంటనే ఎన్నికల గోదాలో దిగటం.. సుదీర్ఘంగా సాగిన ఎన్నికల క్రతువులో మునిగిపోవటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టినంతనే.. గత వాసనలకు భిన్నంగా అందరిని కలవటం.. కలుపుకోవటం లాంటి పనులకు తెర తీశారు రేవంత్. అంతేకాదు.. ఎవరైనా విమర్శలు చేసినా వాటికి సానుకూలంగా స్పందించటం.. తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం లాంటివి చేపట్టారు.

అంతేకాదు.. వేలెత్తి చూపే వారిని మెలి తిప్పి.. ముప్పతిప్పలు పెట్టే విధానానికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేసిన దరిమిలా.. గత పదేళ్లలో గొంతు విప్పేందుకు సైతం జంకే ఎంతోమంది ఇప్పుడు తమ గొంతుల్ని సవరించుకుంటున్నారు. ఇక్కడో ఉదంతాన్ని ప్రస్తావించాలి. ఉద్యమాలే ఆయుధంగా.. తన అల్టిమేటంతో ప్రభుత్వాలకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ప్రజానేతను ఒక కేసు ఉదంతంలో జైలుకు పంపిన కేసీఆర్.. ఆయనకు బెయిల్ లభించేందుకు నాలుగైదు నెలలు సాధ్యం కాని రీతిలో డిజైన్ చేసిన వైనంపై సదరు నేత విస్మయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

తానెందరో ముఖ్యమంత్రుల్ని చూసినా.. కేసీఆర్ తీరు వేరుగా ఉందని.. మిగిలినవారికి భిన్నంగా ఆయన చాలా కర్కశంగా ఉంటారని.. ఆయన ప్రభుత్వంలో గతంలో మాదిరి గొంతు విప్పే పరిస్థితి లేదని.. జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందన్న మాటను తన ప్రైవేటు సంభాషణల్లో చెప్పేవారు. అలాంటి ఆయన సైతం రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత అదే పనిగా అల్టిమేటం ఇవ్వటం కనిపిస్తుంది. ఇదంతా చూస్తే.. పదేళ్ల సారు పాలనలో గొంతు విప్పటానికి సైతం జంకిన వారంతా ఇప్పుడు మాత్రం తమ మాటల్ని కోటలు దాటించే ప్రయత్నం కనిపిస్తుంది.

ఎందుకిలా? అంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే ప్రభుత్వాల్లో ఉండే ఇబ్బందే ఇదంతా. అందుకు భిన్నంగా నోరు విప్పినంతనే కర్కశంగా నలిపేసే తీరు ఉంటే.. గజగజ వణికిపోతారు. అందుకు భిన్నమైన వాతావరణం తెలంగాణలో ఉండటంతో వ్యతిరేక గళాల సౌండ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. గత పదేళ్లకు భిన్నంగా గొంతులు లేవటం కాస్తంత కొత్తగా.. ప్రభుత్వ అసమర్థతతో ఉన్నట్లుగా కనిపిస్తుందన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.

అయితే.. ఈ తరహా విమర్శలకు సీఎం రేవంత్ బెదరటం లేదు సరికదా.. ఆ మాత్రం విమర్శలు లేకపోతే ఏం బాగుంటుంది? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. వాస్తవ కోణంలో చూస్తే.. ప్రజాస్వామ్యంలో ఈ తరహాలో ప్రభుత్వాలు పని చేయటమే మంచిదని మాత్రం చెప్పక తప్పదు. చూస్తున్నంతనే రేవంత్ సర్కారు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ.. అందరు తమ గళాన్ని వినిపించే అవకాశాన్ని మాత్రం పొందుతున్నారని చెప్పాలి. కాకుంటే.. అవసరం లేకుండా హడావుడి చేసే వారి సంఖ్య పెరగటమే కాస్తంత ఆందోళన కలిగించే అంశం. దీన్ని కాస్తంత జాగ్రత్తగా డీల్ చేయాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం మీద ఉందని చెప్పక తప్పదు. మరేం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News