అర్జంట్‌గా అనువాదకులు కావలెను!
ప్రస్తుతం తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు.. అగ్రనేతలను రంగంలోకి దింపాయి.
అవును అనువాదకులు కావలెను. అది కూడా అర్జెంట్‌గా! ఈ మాట బీజేపీ, కాంగ్రెస్ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. అంతేకాదు.. తమకు తెలిసిన ప్రొఫెసర్లు, లెక్చరర్లు.. భాషా పండితులకు ఫోన్లు కూడా చేస్తున్నారు.``సార్.. రెండు రోజులు మాకు అనువాదం చేసి పెట్టండి ప్లీజ్. మీ ఫీజు ఎంతైనా ఫర్వాలేదు`` అని బ్రతిమాలుతున్నారు. కానీ, ఎవరూ స్పందించడం లేదు. ఎందుకంటే.. చాలా మందికి రాజకీయ రంగు పులుముకోవడం ఇష్టం లేకే.
ప్రస్తుతం తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు.. అగ్రనేతలను రంగంలోకి దింపాయి. వీరిలో మెజారిటీ నాయకులకు హిందీ తప్ప.. తెలుగు రాదు. దీంతో వారు చేసే ప్రసంగాలను తెలుగులోకి అనువదించే వారుఅ త్యవసరంగా మారారు. కొన్ని జిల్లాల్లో హిందీలో మాట్టాడినా. ప్రజలు అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు కానీ.. మెజారిటీ జిల్లాల్లో ఆ పరిస్థితి లేదు. దీంతో అనవాదకుల అవసరం ఇప్పుడు కీలకంగా మారింది.
ప్రదాని నరేంద్ర మోడీ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని అనువాదం చేస్తున్నారు. అమిత్ షా కార్యక్రమాల్లో ఒకరిద్దరు అనువాదం చేస్తున్నారు. కానీ, కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ వంటివారికి తెలుగు రాదు. దీంతో వీరి హిందీ ప్రసంగాలను తెలుగు లోకి అనువదించేవారు కావాల్సి ఉంది.
ఇక, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి.. రాహుల్‌కు తెలుగు రాదు. ఆయనకు ఓయూ ప్రొఫెసర్‌ను అనువాదం కోసం నియమించారు. ప్రియాంక గాంధీ శనివారం అనువాదకులు లేక ఇబ్బంది పడ్డారు. ఇక, మల్లికార్జున ఖర్గే కు సగంసగం తెలుగు రావడంతో సర్దుకు పోతున్నారు. కానీ, ఇతర నాయకుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. దీంతో కీలక సమయంలో అనువాదకులు లేకపోవడంతో అర్జంట్‌గా అనువాదకులు కావాలని ఇరు పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే.. ఏ పార్టీకి అనువాదకులు గా చేసినా.. వారిపై రాజకీయ ముద్ర పడుతుందనే ఉద్దేశంతో విద్యాధికులు సాహసించడం లేదు. మీకు ఇంట్రస్ట్ ఉంటే.. పార్టీ కార్యాలయాలను సంప్రదిస్తే.. తక్షణ ఉద్యోగం. షరా.. మూడు రోజుల ఉద్యోగం మాత్రమే !!