ట్రంప్ పై హత్యాయత్నం.. నిందితుడు ఉక్రెయిన్ యుద్ధ సైనిక రిక్రూటర్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది.

Update: 2024-09-16 15:30 GMT

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. నవంబరు 5 నాటికి ఇంకా ఎన్ని మలుపులు చూడాల్సి ఉంటుందో ఏమో కానీ.. ఇప్పటికైతే ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ దూసుకెళ్తుంటే, వరుస హత్యాయత్నాలతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేరు జనంలో నానుతోంది. తాజాగా ఆయనపై ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంతకూ ఎవరీ ర్యాన్ వెస్లీ అంటే.. అతడికి పెద్ద చరిత్రే ఉంది.

అనుమానాలు.. డెమోక్రాట్లపై అభిమానం

ర్యాన్ వెస్లీ చరిత్ర చూస్తే అనేక అనుమానాలు, ట్రంప్ పత్యర్థి పార్టీ డెమోక్రాట్లపై అభిమానం కనిపిస్తోంది. పలు క్రిమినల్ కేసులున్న ఇతడు ఉక్రెయిన్ యుద్ధానికి విదేశీ సైనికులను నియమించినట్లు గతంలో ప్రకటించుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు సాయం చేయడం ఇతడి లక్ష్యం. అంతేకాదు.. ఉక్రెయిన్ పట్ల అమెరికా విధానాన్ని కూడా విమర్శించేవాడు. యుద్ధం మొదలైన 2022లోనే ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ పదాతి దళంలో ఒక భాగమైన ఇంటర్నేషనల్‌ లీజియన్‌ డిఫెన్సెస్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ కు వాలంటీర్లను నియమించాడు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని మంచి, చెడుకు మధ్య జరిగే పోరాటంగానూ.. ఓ కథగానూ అభివర్ణించాడు. తాలిబన్ల కారణంగా పారిపోయిన అఫ్గానిస్థాన్‌ సైనికులను ఉక్రెయిన్‌ కోసం నియమించినట్లు.. యుద్ధం మొదలైన 2022 నుంచి తాను ఉక్రెయిన్‌ లోనే ఉన్నట్లు వెల్లడించాడు. అక్కడి ఇంటర్నేషనల్‌ వాలంటీర్‌ సెంటర్‌ కు చీఫ్ గానూ ప్రకటించుకున్నాడు. ర్యాన్‌ పై 2002లో మారుణాయుధాలు కలిగి ఉన్నాడని నేరం రుజువైంది. దీంతో చాలా రోజులు పరారీలో ఉన్నాడు. 2008లోనే 32 వేల డాలర్ల పన్నుకు సంబంధించిన వివాదంలో చిక్కుకున్నాడు. హవాయిలో ఇతడి ఇంటివద్ద పికప్‌ ట్రక్ పై బైడన్‌-హారిస్‌ స్టిక్కర్‌ ఉంది

డెమోక్రాట్ల అభిమాని.. ప్రచారం పిచ్చి

ర్యాన్ రౌత్.. డెమోక్రాటిక్ పార్టీకి విరాళం ఇచ్చాడు. ఆ పార్టీకి అభిమాని. ప్రచారాన్ని బాగా ఇష్టపడే అతడు.. తన సోషల్ మీడియా ఖాతాలో ఆ మేరకు సంచలన పోస్ట్ లు పెట్టాడు. ఉక్రెయిన్‌ తరఫున యుద్ధంలో పాల్గొన్నట్లుగా అమెరికా అధికారులు గుర్తించారు. కాగా, ర్యాన్‌ కస్టడీలో ప్రశాంతంగా ఉన్నాడట. నన్నెందుకు అరెస్టు చేశారని కూడా ప్రశ్నించడం లేదట.

కొసమెరుపు: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ర్యాన్.. 2016లో ట్రంప్ ను అద్బుత నాయకుడిగా భావించి గెలించామని గతంలో పోస్ట్ చేశాడు. 2020లో అతడు ట్రంప్ ను అత్యంత చెత్త అధ్యక్షుడిగా అభివర్ణించాడు. ఓడిపోవాలని కోరుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ పై హత్యాయత్నంతో ఏకంగా అతడి సోషల్ మీడియా ఖాతాలు ఫేస్ బుక్, ఎక్స్ లను రద్దు చేశారు.

Tags:    

Similar News